ఇదిగో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

ఇదిగో పరిష్కార వేదిక

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

సత్వర చర్యలు సద్వినియోగం చేసుకోండి

షాద్‌నగర్‌: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను విన్నవించేందుకు అధికారుల వద్దకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 3 జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు.

రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ..

ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా ప్రజావాణి సేవలను క్షేత్ర స్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సర్కార్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది.

నోడల్‌ అధికారిగా ఆర్డీఓ

జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌తో పాటుగా జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆయా ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

హాజరు కానున్న డివిజన్‌ అధికారులు

ప్రజావాణికి డివిజన్‌ పరిధిలోని ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు. డివిజన్‌ స్థాయి వైద్యాధికారి, పంచాయతీ, వ్యవసాయ విస్తరణ, గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖ, పంచాయతీరాజ్‌, మంచినీటి శాఖలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరవుతారు. వీరు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. లేదంటే తిరస్కరణ, పెండింగ్‌కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరి దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్‌ నమోదు చేసి దరఖాస్తుదారుకు రసీదు అందజేస్తారు. దరఖాస్తుకు సంబంధించిన పరిస్థితిని ప్రజావాణి పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయొచ్చు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– సరిత, ఆర్డీఓ, షాద్‌నగర్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు ఆర్డీఓ అనంతరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి డివిజన్‌ స్థాయి అధికారులు డీఎల్‌పీఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఏడీఏ, డీఈఈ (ఆర్‌అండ్‌బీ), డీఈఈ (ఆర్‌డబ్ల్యూఎస్‌), సీడీపీఓ, ఏఎస్‌సీడీఓ, ఏటీడీఓ, ఏబీసీడీఓ, ఏఎండబ్ల్యూఓ, ఇతర శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఇచ్చే అర్జీలు స్వీకరించి తక్షణం పరిష్కారం చూపుతారని చెప్పారు. అధికారులు హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరింత చేరువగా ప్రజావాణి

నేటినుంచి డివిజన్‌ కేంద్రాల్లో కార్యక్రమం

ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహణ

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం

Advertisement
 
Advertisement
Advertisement