తీవ్రమైన నేరం..
గ్రేటర్‌లో బెంబేలెత్తిస్తున్న హిట్ అండ్ రన్ ప్రమాదాలు
● అతివేగం, మద్యం మత్తులో దారుణాలు
● ద్విచక్ర వాహనదారులు,
పాదచారులే బాధితులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో హిట్ అండ్ రన్ (వాహనంతో ఢీకొట్టి పారిపోవడం) ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెనక, పక్క నుంచి వాహనంతో ఢీ కొట్టి ఘటనా స్థలం నుంచి జారుకునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అతివేగం, అలసట, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మానవత్వం మరిచి..
సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవు తుంటారు. ఈ తరహా కేసులలో నిందితులు బాధితులను వెనకాల నుంచి ఢీ కొట్టేసి కనీసం క్షతగాత్రులు ఎలా ఉన్నారని చూడకుండా, మానవత్వం లేకుండా నాలుగైదు కిలో మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులు సీసీటీవీ కెమెరాలు లేని నిర్మానుష్య ప్రాంతంలో, రాత్రి వేళల్లో జరగడంతో ఈ తరహా కేసులు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై, నిర్మానుష్య ప్రాంతాలలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువగా అవుతుంటాయి. సాధారణ రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసులలో మరణాల శాతం ఎక్కువ. హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, ఘటనా స్థలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో బాధితులు మరణిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు ఇలా.. .
మీర్‌పేటలోని గాయత్రినగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై తండ్రీ కొడుకులు జిలానీ, ఫైజల్‌లు వెళుతుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు వారిని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా.. జిలాని కారును ఆపేందుకు యత్నించాడు. అతడు కారు బానెట్‌పై ఉండగానే కారు ఆపకుండా డ్రైవర్ సుమారు 2 కి.మీ దూరం లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద ప్రయాణికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు.
● దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన బెంజ్ కారు ఢీ కొట్టడంతో బ్రిడ్జిపై శ్యాంరాజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు మహ్మద్ అబ్దుల్ నవీద్‌ను పోలీసులు ఊటీలో పట్టుకున్నారు.
● గచ్చిబౌలిలో మద్యం మత్తులో కారు నడుపుతూ తరుణే అనే వ్యక్తి మరొక వాహనాన్ని ఢీ కొట్టాడు. ఘటనాస్థలి నుంచి పరారవుతున్న తరుణ్‌ను నిలువరించేందుకు యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులును ఢీకొట్టి.. కిలో మీటరు దూరం వరకూ కారు బానెట్‌పై ఈడ్చుకుంటూ వెళ్లాడు.
● 2022లో జూబ్లీహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహ్మద్ రహీల్ ఆమీర్ తన ఇద్దరు స్నేహితులు సయ్యద్ అఫ్నాన్ అహ్మద్, మోహిత్ ఖాన్‌లు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కారు.. బెలూన్ విక్రయించే మహిళ కాజల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాజల్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఆమె రెండున్నర నెలల బాబు మరణించాడు.
హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన నేరాలు. ఈ ప్రమాదాలలో కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ కేసులను ప్రత్యేక కార్యాచరణతో దర్యాప్తు చేస్తున్నాం.
– వి.శ్రీనివాసులు, డీసీపీ, మల్కాజిగిరి ట్రాఫిక్– 2


