కార్ఖానా కుంటను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

కార్ఖానా కుంటను కాపాడండి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

కార్ఖానా కుంటను కాపాడండి వీర సైనికుల త్యాగాలు మరువలేనివి ‘నీట్‌’గా ముగిసింది చిరునామా తికమక

హయత్‌నగర్‌: చెరువులను కాపాడాల్సిన హైడ్రా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం పనిచేస్తూ కాలనీ ప్రహరీని కూల్చి వేస్తారా అంటూ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నాగోల్‌ సర్కిల్‌ పెద్దఅంబర్‌పేట్‌ డివిజన్‌ కుంట్లూర్‌ పరిధిలోని ప్రజయ్‌ గుల్మోర్‌ కాలనీ ప్రహరీని హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. కూల్చి వేసిన ప్రహరీని ఆదివారం మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నర ఎకరాల్లో పక్కనే ఉన్న కార్ఖానా కుంట చెరువు కబ్జాకు గురై రెండు ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు. దానిని కాపాడలేని హైడ్రా అధికారులు 241 ఇళ్లు ఉన్న ప్రజయ్‌ గుల్మోర్‌ ప్రహరీని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రహరీ కూల్చివేతతో కాలనీకి భద్రత లేకుండా పోయిందన్నారు. హైడ్రా పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు కృపాసాగర్‌, శివరామకృష్ణ, పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

మొయినాబాద్‌: దేశ రక్షణకోసం అసువులుబాసిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కల్నల్‌ శ్రీనివాస్‌ అన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో వచ్చే నవంబర్‌లో జరగనున్న 201 మద్రాసు ఇంజనీరింగ్‌ రెజిమెంట్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశం ఆదివారం మున్సిపల్‌ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1971లో ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో తాను కమాండింగ్‌ ఆఫీసర్‌గా స్వయంగా పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేశారు. సైనికులు, మాజీ సైనికులు రెజిమెంట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.

హుడాకాంప్లెక్స్‌: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌–యూజీ) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌లోని పరీక్ష కేంద్రంలో మొత్తం 240 మందికి 240 మంది పరీక్ష రాశారు. వంద శాతం హాజరు నమోదైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్‌ అనురాధ తెలిపారు.

పరీక్ష రాయలేక విద్యార్థిని కన్నీటి పర్యంతం

హయత్‌నగర్‌: నీట్‌ హాల్‌ టికెట్‌లో చిరునామా గందరగోళం కారణంగా ఓ విద్యార్థిని పరీక్షకు హాజరు కాలేకపోయిన ఘటన హయత్‌నగర్‌లో ఆదివారం జరిగింది. యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన కరకల రమేష్‌ కూతురు దుర్గా మీనాక్షి నీట్‌ పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. తనకు ఇచ్చిన హాల్‌ టికెట్‌పై మాణిక్యమ్మ కాలనీ రాజేంద్రనగర్‌ హయత్‌నగర్‌ రంగారెడ్డి జిల్లా అని ఉంది. దీంతో ఈ అడ్రస్‌ హయత్‌నగర్‌లో ఉండవచ్చని భావించిన రమేష్‌ కూతురును తీసుకుని భువనగిరి నుంచి హయత్‌నగర్‌కు వచ్చారు. చివరి 20 నిమిషాల్లో హయత్‌నగర్‌లోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సెంటర్‌ నెంబర్‌ ప్రకారం రాజేంద్రనగర్‌లో ఉందని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో చివరి నిమిషంలో పరీక్షకు హాజరు కాలేక పోయిన విద్యార్థిని ఆమె తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement