కో ఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో! | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో!

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

త్వరలోనే ఎన్నిక

చేవెళ్ల: మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికు నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్లు స్వీకరించినప్పటికీ సభ్యుల ఎన్నిక మాత్రం జరగడం లేదు. మైనార్టీ కోటా విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేక వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తరువాత నలుగురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు అన్ని మున్సిపాలిటీలకంటే ముందుగానే చేవెళ్ల మున్సిపల్‌ కమిషనర్‌ మార్చి 10న నోటిఫికేషన్‌ జారీ చేసి నామిషన్‌లు సైతం స్వీకరించారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ప్రత్యేక అనుభవం కలిగిన ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గం (మైనార్టీ) నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రత్యేక అనుభవం ఉన్న కోటా నుంచి ఒకటి జనరల్‌, ఒకటి మహిళకు కేటాయించాలని స్పష్టత ఉన్నా, మైనార్టీ కోటాలో ఉన్న రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్‌లు ఎక్కువగా రావడంతో పోటీ ఏర్పడింది.

మైనార్టీ నేతల పట్టు

పార్టీ తరఫున ఎవరిని బలపరిచాలని, ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై కౌన్సిలర్లకు పార్టీ పెద్దలు నిర్ణయం చెప్పకపోవడంతో వాయిదా వేశారు. మార్చి 30న తేదీని ఖరారు చేసినప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటిస్తామని చెప్పి నెలరోజులు దాటినా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. తాము పార్టీకోసం పనిచేశామని తమకే కేటాయించాలని మైనార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో ఒకరికి ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా మారతారనే ఆలోచనతో నచ్చజెప్పేందుకు పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎవరూ సమయం కేటాయించకపోవడంతో ఆలస్యం అవుతోంది.

ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ

నామినేషన్ల స్వీకరణ పూర్తి

నెలరోజులు దాటినా జరగని ఎన్నిక ప్రక్రియ

మైనార్టీ కోటాలో కుదరని ఏకాభిప్రాయం

పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూపులు

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికను త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటికే నామినేషన్‌లు పూర్తయ్యాయి. మైనార్టీ కోటకు సంబంధించి పలువురు పోటీ పడుతుండటంతో ఆలస్యమైంది. వారితో చర్చించి, ఎమ్మెల్యేతో మాట్లాడి ఎంపికను పూర్తి చేస్తాం. అంతా కలిసి మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతాం.

– దేవర సమతావెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, చేవెళ్ల

Advertisement
 
Advertisement
Advertisement