‘సైబరాబాద్‌’లో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

‘సైబరాబాద్‌’లో గందరగోళం

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

‘సైబరాబాద్‌’లో గందరగోళం

65 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు బ్రేక్‌

రాత్రి బదిలీల ఉత్తర్వులు.. ఉదయం నిలిపివేత

రాజకీయ ఒత్తిళ్లే కారణమంటున్న పోలీసు వర్గాలు

పైరవీకారులకే కీలక పోస్టింగ్‌లంటూ విమర్శలు

సాక్షి, సిటీబ్యూరో: పోలీసు అధికారుల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు మరోసారి బయటపడ్డాయి. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఒకేసారి 65 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ఈ ఉత్తర్వులు హోల్డ్‌లో పెడుతున్నట్లు స్వయంగా కమిషనర్‌ ఆదివారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు గందరగోళంలో పడ్డారు. ఉత్తర్వులు ఇచ్చిన పోలీసు బాసే ఆ పోస్టింగ్‌ల్లో ఎవరూ బాధ్యతలు తీసుకోవద్దని చెప్పడంతో ఈ బదిలీలపై రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. సైబరాబాద్‌లోని 54 మంది ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ.. మరో పదకొండు మందిని మల్టీజోన్‌–2కు సరెండర్‌ చేస్తూ మొత్తం 65 మందిని బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. ఆదివారం ఉదయం పొలిటికల్‌ దెబ్బకు ఈ బదిలీలన్నీ నిలిచిపోయాయి.

ఎంత ఖర్చు పెట్టయినా..

మరోవైపు ఈ బదిలీలు సక్రమంగా జరగలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జోన్‌ స్థాయి అధికారులకు సన్నిహితంగా ఉండి.. వారు చెప్పినట్లు పనిచేసిన వారికి, నచ్చిన వారికి కీలక పోస్టింగ్‌లు దక్కాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సైబరాబాద్‌లో ఖరీదైన జోన్‌గా పేరున్న ఆ ప్రాంతంలో ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌లకు తీవ్ర పోటీ ఉండటంతో, ఎంత ఖర్చు పెట్టయినా సరే పోస్టింగ్‌ దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులైతే ఏకంగా ముఖ్య నేతలతో చెప్పించుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నవారికే కీలక పోస్టింగ్‌లు దక్కాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా పనిచేసే వారికి కాకుండా పైవీకారులకు పెద్దపీట వేశారని పోలీసు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement