పోలీసు విభాగం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ పరిధిలో కొత్తగా నాలుగో పోలీసు కమిషనరేట్ ఫ్యూచర్ సిటీని గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషనరేట్ ఏర్పాటై ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ కమిషనరేట్‌కు వెబ్‌సైట్ అంటూ లేదు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పోలీసు కమిషనరేట్‌కు శాశ్వత భవనం కోసం ఇటీవలే మీర్‌ఖాన్‌పేటలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భూమి పూజ పనులను సైతం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి విదితమే.
● ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగం పరిస్థితి ఇదీ
● కమిషనరేట్ మొత్తానికి షాద్‌నగర్ సెంటర్‌లోనే సిగ్నల్
● రోడ్డు భద్రత అవగాహనపైనే పోలీసుల దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ నాలుగో నగరిలో ప్రజలకు రక్షణ, పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు గతేడాది డిసెంబర్‌లో ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషనరేట్ మొత్తానికి కేవలం షాద్‌నగర్ సెంటర్‌లో ఒక్కటే ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఈ సిగ్నల్ ఉన్న ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లు సహా 150 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.
రోడ్డు భద్రత అవగాహనకే ప్రాధాన్యత..
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) మొత్తం 760 చ.కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల మూడు శాంతి భద్రతల జోన్లు ఉండగా.. కమిషనరేట్ మొత్తం ఒకటే ట్రాఫిక్ జోన్‌గా ఉండగా.. షాద్‌నగర్, మహేశ్వరం రెండు డివిజన్లు, షాద్‌నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నాలుగు ట్రాఫిక్ ఠాణాలున్నాయి. దీంతో కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదులుగా ట్రాఫిక్, రహదారి భద్రతపై అవగాహనకే ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో స్థానికులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఉల్లంఘనలకు జరిమానాలు, ఇతరత్రా అంశాలపై విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతరత్రా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
వెబ్‌సైట్‌కూ దిక్కేలేదు..
ఒక ట్రాఫిక్ సిగ్నల్.. విధుల్లో 150 మంది


