ప్రమాదంలో రైతు దుర్మరణం
చేవెళ్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ బస్‌స్టేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడ గ్రామానికి చెందిన కొలన్ దివాకర్‌రెడ్డి(26) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య పూజ, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన కారులో స్వగ్రామం నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దివాకర్‌రెడ్డి కారులో ఇరుక్కు పోయి త్రీవంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయలు కావడంతో ప్రమాదాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలియడంతో గుండాల, లక్ష్మీగూడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన వ్యక్తి మృతితో భార్య, కొడుకు ఆగమవుతారని గ్రామస్తులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాల పక్కన నిద్రించి.. చేయిపోగొట్టుకొని
ఆస్పత్రి పాలైన కార్మికుడు
తాండూరు రూరల్: తాగిన మైకంలో రైల్వే ట్రాక్‌పక్కన నిద్రించిన కార్మికుడు.. తన చేయిని పట్టాలపై పెట్టాడు. ఈ సమయంలో చేయిపై నుంచి రైలు వెళ్లడంతో చేయి తెగి పడింది. ఈ సంఘటన మండల పరిధి మిట్ట బాసుపల్లి గుంతబాసుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లి అనుబంధ కాలని వడ్డెర కాలనీకి చెందిన పరమేష్, జగదీష్‌లు నాపరాతి గనుల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు చంద్రవంచ దర్గా వద్ద కల్లు తాగడానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తూ.. మిట్టబాసుపల్లి– గుంత బాసుపల్లి గ్రామాల సరిహద్దు సిమెంట్ కర్మాగారంలోకి వెళ్లేందుకు ఉన్న రైలు మార్గం పక్కన చెట్టుకింద నిద్రించారు. నిద్రలో పరమేష్ తన కుడి చెయ్యి రైలు పట్టాల మీద పెట్టాడు. గూడ్స్ రైలు అతని చేయిపై నుంచి వెళ్లడంతో చేయి తెగి పడింది. వెంటనే అతన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితున్ని నగరంలోని గాంధీకి తీసుకెళ్లారు. కూలీ పనులు చేసుకొని జీవించే పరమేష్.. చేయి కోల్పోయి జీవనోపాధి కోల్పోయాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
దుద్యాల్: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధం అయింది. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్ల అనుబంధ గ్రామమైన పల్లెగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తడకలి కృష్ణయ్య ఎప్పటిలాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో రెండు ఆవులు, రెండు దూడలను కట్టేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు పాకలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు.. వెంటనే పాకలోని ఆవులు, దూడలను కాపాడగా.. వాటికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం 25 కిలో మీటర్ల దూరంలోని కొడంగల్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చేలోగా కొట్టం కాలి బూడిదయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. కాగా.. పాక ప్రమాదశాత్తు తగల బడిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.


