పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్ కరణ్ రెండు నెలల క్రితం తన భార్య రాధ(20), కుమార్తె నైనాతో కలిసి జల్‌పల్లి ఆర్.ఆర్.ఫాం హౌస్ ఎదురుగా ఉన్న ఓంకార్ పశువుల దాణా కంపెనీలో కార్మికుడిగా చేరి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న పని మీద బయటికి వెళ్లిన రామ్ కరణ్ మధ్యాహ్నం వచ్చి చూడగా కుమార్తె ఏడుస్తూ కనిపించింది. భార్య కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
డీసీఎం ఢీకొని
యువకుడి దుర్మరణం
షాబాద్: డీసీఎం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మనీష్‌దాస్(22) మల్లారెడ్డిగూడ స్టేజీ సమీపంలో అద్దె గదిలో ఉంటూ సీతారాంపూర్ సమీపంలోని సోలార్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు ఉండడంతో మధ్యాహ్నం స్థానికంగా కూరగాయలు తీసుకొని రోడ్డు దాటుతుండగా చేవెళ్ల వైపు నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం అతన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ ఆపకుండా వెళ్తుండగా షాబాద్ పోలీసులు సర్ధార్‌నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఆకాశ దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిట్టీల పేరుతో మోసం
భార్యాభర్తలపై బాధితుల ఫిర్యాదు
మీర్‌పేట: చిట్టీల పేరుతో భార్యాభర్తలు మోసం చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. బడంగ్‌పేట వైష్ణవికాలనీకి చెందిన సురేష్‌కుమార్, సౌజన్య దంపతులు స్థానికంంగా కొన్నేళ్ల నుంచి చిట్టీల పేరుతో కొంతమంది వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చిట్టీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో చేసేది లేక దాదాపు 26 మంది బాధితులు ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సురేష్‌కుమార్, సౌజన్యలు దాదాపు రూ.రెండు కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


