సాక్షి, రంగారెడ్డిజిల్లా: డివిజినల్ స్థాయిలో ఈ నెల 4 నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సంబంధిత ఆర్డీఓలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవో నంబర్ 3 ప్రకారం ఆర్డీఓల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్‌తో డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగింపు లేదా సవరణ చేపట్టాలని తెలిపారు.
ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో జూనియర్ సివిల్‌జడ్జిగా శనివారం నారం అరుణ్‌కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోర్టు జడ్జిగా ఉన్న కాటం స్వరూప బదిలీ కాగా హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో అసిస్టెంట్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్‌కుమార్ ఇక్కడికి వచ్చారు. పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ జానకిరాంరెడ్డి, కడ్తాల ఎస్‌హెచ్‌ఓ సైదిరెడ్డి, మాడ్గుల ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులతో జడ్జి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీపీ కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో మే, జూన్ నెలల గోధుమల కోటా పంపిణీ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఎం.రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో మొత్తం 8,40,345 కుటుంబాలకు 8,81,497 కుటుంబాలు 104.90 శాతం మూడు నెలల బియ్యం కోటాను డ్రా చేసినట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 71,382.977 మెట్రిక్ టన్నుల బియ్యంలో 62,373.682 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గోధుమల కోటా విషయంలో ఒక నెల కోటా మాత్రమే ఇప్పటివరకు పంపిణీ చేశారని, మిగతా రెండు నెలల కోటా పదిహేను రోజుల వరకు కొనసాగుతుందన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు సహా అందరూ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాజిరెడ్డి సూచించారు.
సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ నుంచి జవహర్‌లాల్ పోర్టుకు (జేఎన్‌పీటీ) ప్రాణ రక్షణ ఔషధాలను రవాణా చేసే శీతలీకరించిన కాన్‌కోర్ కంటైనర్ రేక్ ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ శనివారం సనత్‌నగర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి ప్రారంభించారు. ప్రాణరక్షక ఔషధాలు, ఇతర సున్నితమైన వస్తువులను సురక్షితంగా రవాణా చేసేందుకు ఔషధి ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించారు. దేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. నగరంలోని కీలక ఫార్మా ప్రాంతాలైన జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల, పటాన్‌చెరు, ముచ్చర్ల నుంచి జేఎన్‌పీటీ కారిడార్‌కు ఔషధి ఎక్స్‌ప్రెస్ మందులను సరఫరా చేయనుంది. కార్యక్రమంలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సంజయ్ స్వరూప్, ద.మ.రైల్వే ఉన్నతాధికారులు కె.పద్మజ, ఈటీ పాండే, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


