పహాడీషరీఫ్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటన మరువక ముందే తుక్కుగూడ ఔటర్‌పై శనివారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహ అనే వ్యక్తి ఐదుగురితో కలిసి కారులో (టీజీ 08 ఏఏ 4704) ఔటర్‌పై శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్నాడు. ఉదయం 11.55 గంటల సమయంలో తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్–14 సమీపంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆపడంతో, డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరొకరు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందని కారణంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.
ఇద్దరికి గాయాలు


