సాక్షి, రంగారెడ్డిజిల్లా: నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో నకిలీ విత్తనాల నిర్మూలన అంశంపై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తన రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మూడు, డివిజన్ స్థాయిలో ఆరు, మండల స్థాయిలో 26 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, సీడ్ కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖల సమన్వయంతో ఈ బృందాలు పని చేస్తాయని చెప్పారు. జిల్లాలో 474 రిటైల్ విత్తన దుకాణాలు, తొమ్మిది సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 224 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని అన్నారు. పత్తి, మిర్చి పంటల్లో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని పూర్తిగా నియంత్రించేందుకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా తయారు చేసిన విత్తనాలు సహా అనధికారికంగా విక్రయించేవి, సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసిన విత్తనాలు, తక్కువ నాణ్యతతో కూడిన విత్తనాలను నకిలివీగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. విత్తనాల నమూనాల సేకరణ, పరీక్షలు సహా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 420, ఈసీయాక్ట్ 1955, సీడ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. రైతులు విధిగా లైసెన్సు ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అనధికారిక విక్రేతల వద్ద కొనొద్దని సూచించారు. సమావేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) పత్తి విత్తనాలపై కూడా చర్చించారు. ఈ విత్తనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించని జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలు కావడంతో వాటి సాగు చట్ట విరుద్ధమని, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమని చెప్పారు. గ్లైఫోసేట్ వంటి రసాయనాల వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉష పాల్గొన్నారు.


