జీడిమెట్ల: కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.35 వేల జరిమానా విధించింది. వివరాలు... బీహార్‌కు చెందిన అస్గర్ అలీ(36) భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి 2019లో నగరానికి వలస వచ్చి సుభాష్‌నగర్‌లోని గంపలబస్తీలో ఉంటున్నాడు. అస్గర్ దినసరి కూలీ కాగా, అతడి భార్య ఇళ్లల్లో పనిమనిషి. గతేడాది మే నెలలో అస్గర్ అలీ పెద్దకుమార్తె(15)పై లైంగికదాడికి పాల్పడగా చిన్న కుమార్తె గమనించి తల్లికి చెప్పింది. 2025 మే 6న బాధితురాలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అదే నెల 8న కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేయగా, మేడ్చల్ పాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.వెంకటేష్ విచారణ జరిపి నిందితుడిని దోషిగా తేల్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేశారు.
పోలీస్ కస్టడీకి నిందితుడు
బంజారాహిల్స్: సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను ప్రేమపేరుతో మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడి జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వివరాలు.. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ యువతిని ప్రేమపేరుతో లోబర్చుకుని రూ.13 లక్షల దాకా వసూలు చేశాడు. మణికొండకు చెందిన మరో యువతి వద్ద కూడా బంగారం తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ఆయన సోదరుడు రాజీవ్‌ను కూడా మూడు రోజుల క్రితం రిమాండ్‌కు తరలించారు. అన్నదమ్ములిద్దరూ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇన్‌స్ట్రాగామ్‌లో అమ్మాయిలను ఆకర్షించి లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమంది యువతులను మోసం చేశారనే విషయం విచారణలో తేలనుంది. నిందితుడితోపాటు పబ్‌లు, హోటళ్లకు వెళ్తూ అమ్మాయిలకు వల వేస్తున్న మరికొంతమంది యువకులపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
మర్రిగూడ(చింతపల్లి): అత్తగారింటి వద్ద తన కుమార్తె పురుడుకు వచ్చి వెళ్తుండగా కారు ఢీకొని యువకుడు మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గేట్ వద్ద జరిగింది. స్థానిక ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్దఅంబర్‌పేట్ గ్రామానికి చెందిన ఆవుల రవితేజ (22)కు ఇటీవల కుమార్తె జన్మించింది. గురువారం రవితేజ అత్తగారి ఊరైన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం రోళ్లకల్లులో తన కుమార్తె పురుడు చేశారు. కార్యక్రమానికి మధు, అతడి స్నేహితుడు చేవెళ్ల సుజిత్‌కుమార్ కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. పురుడు అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం మదనాపురం గేటు వద్దకు రాగానే కారు రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, సుజిత్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరినీ మాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవితేజ శుక్రవారం మృతిచెందాడు. సుజిత్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. రవితేజ తండ్రి ఆవుల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి..
కుత్బుల్లాపూర్: నిర్మాణ సంస్థకు చెందిన సైట్ ఇంజనీర్, మరో నలుగురు కూలీలు కలిసి ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్‌రామ్(35) కుటుంబంతో కలిసి కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్‌కు వలస వచ్చి స్థానికంగా పాల్మీరా మిడోవ్స్ ప్రైడ్ ఇన్‌ఫ్రాలో కూలీగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో సునీల్‌రామ్ వ్యక్తిగత విషయాలపై తన భార్యతో గొడవ పడసాగాడు. సమాచారం అందుకున్న సైట్ ఇంజనీర్ ప్రసాద్, మరో నలుగురు కూలీలు అక్కడికి చేరుకుని సునీల్‌రామ్‌ను బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం అతనిపై దాడి చేసి స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. శుక్రవారం సునీల్ రామ్ భార్య అక్కడికి వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉన్నాడు. సైట్ ఇంజనీర్, నలుగురు కూలీల వల్లే తన భర్త మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


