ఉరివేసుకొని బలవన్మరణం
శంకర్‌పల్లి: కల్లుకు బానిసైనా ఓ వ్యక్తి.. దాన్ని తాగొద్దన్నందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన శ్రీశైలం (46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్ల నుంచి కల్లు తాగే అలవాటు ఉండగా ఆరోగ్యం పాడవుతుందని మానేయాలని కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి కల్లు మానేసిన ఆయన అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కేశంపేట: ఆర్‌ఎంపీ వైద్యుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన భూయాకర్ రవీందర్ గ్రామంలోనే ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. గతనెల 24న ఇంట్లో పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవీందర్ మరుసటి రోజున ఇంట్లో నుంచి క్లినిక్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆమనగల్లు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. బంధువులు, తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భార్య శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
కేశంపేట: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వేములనర్వ గ్రామానికి చెందిన కుమ్మరి అంతమ్మ (70) కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఏప్రిల్ 30న పింఛన్ డబ్బులు తీసుకుంది. వాటితో శుక్రవారం మద్యం తాగి పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి కుమారుడు సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఏ) భద్రతా వ్యవస్థల క్రమబద్ధమైన నిర్వహణ, పారదర్శక పాలన,ఉమ్మడి స్థలాలపై దృష్టి పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నారెడ్కో తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్‌టీసీసీఐ), యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యు–ఫెర్వాస్) సంయుక్తంగా ఫెడరేషన్ హౌస్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ.. స్వీయ జనగణనకు మద్దతు ఇవ్వాలని నివాసిత సంఘాలను కోరారు. హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, గేటెడ్ లేఅవుట్‌లు, వాణిజ్య సముదాయాలు గణనీయంగా పెరిగాయని, ఎప్పటికప్పుడు చట్టబద్ధమైన పునరుద్ధరణలు, భద్రతా నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ విక్రంమాన్ సింగ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.


