సాక్షి, రంగారెడ్డిజిల్లా: రూరల్ ఏరియాలోని విద్యార్థులతో పోలిస్తే.. అర్బన్ ఏరియాలోని విద్యార్థులు మాతృభాషపై పట్టుసాధించలేకపోతున్నారు. ఇక్కడ చదువుతున్న వారిలో మెజార్టీ విద్యార్థులు మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. దీనికి బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు/కార్మికుల పిల్లలు తోడయ్యారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేషిస్తే హిందీ, ఇంగ్లిష్‌తో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిలయ్యారు. హిందీలో కేవలం 94 మంది ఫెయిల్ అయితే.. ఇంగ్లిష్‌లో 761 మంది ఫెయిల్ అయ్యారు. ఇక తెలుగులో ఏకంగా 862 మంది ఫెయిల్ కావడం గమనార్హం. ఇంగ్లిష్, హిందీపై ఉన్న పట్టు మాతృభాషపై ఉండటం లేదు. అదే గ్రామీణ ప్రాంత ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లిష్‌లో తప్పిన వారిలో మెజార్టీ ఈ ప్రాంత వాసులే. ఇక గణితంలో 1,892 మంది, సైన్స్‌లో 1,737 మంది విద్యార్థులు ఫె యిల్ అవ్వడం విశేషం.
రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినా..
జిల్లాలో 1,024 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 52,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 49,217 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్/ ప్రైవేటు స్కూల్స్ నుంచి అత్యధికంగా 35,307 మంది హాజరు కాగా, వీరిలో 33,977 మంది ఉత్తీర్ణులయ్యారు. మరో 1,330 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో మెజార్టీ విద్యార్థులు తెలుగు సబ్జెక్టులోనే ఉన్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి, ప్రత్యేక తరగతులు బోధించినా వందశాతం ఫలితాలు సాధించలేకపోయాయి. 708 స్కూల్స్‌లో 262 మాత్రమే వందశాతం ఫలితాలు సాధించాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తీర్ణతలో జిల్లా వెనుకబాటుకు ఇది కూడా మరోకారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
అర్బన్ మండలాల్లోనే అత్యధికం
జిల్లాలోని రూరల్ మండలాలతో పోలిస్తే.. నగరానికి అతిసమీపంలో ఉన్న అర్బన్ మండలాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తేలింది. మెజార్టీ విద్యార్థులు తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయినట్లు ఫలితాల విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. శంషాబాద్ మండల పరిధిలో 1,700 మంది పరీక్షకు హాజరైతే 1,495 మంది మాత్రమే ఉత్తీర్ణత (87.94 శాతం) సాధించారు. ఇక్కడ 205 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. శంకర్‌పల్లిలో 1,140 మంది పరీక్షకు హాజరైతే 1,010 మంది మాత్రమే (88.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 130 మంది ఫెయిల్ అయ్యారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1,998 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,776 మంది ఉత్తీర్ణత(88.89శాతం) సాధించారు. ఇక్కడ మొత్తం 222 మంది ఫెయిల్ అయ్యారు. రాజేంద్రనగర్‌లో 5,267 మంది పరీక్షకు హాజరు కాగా, 4,691 మంది ఉత్తీర్ణత (89.06శాతం) సాధించారు. ఇక్కడ ఏకంగా 576 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం విశేషం. మహేశ్వరంలో 1,613 మంది పరీక్షకు హాజరు కాగా 1,437 మంది ఉత్తీర్ణత (89.09 శాతం) సాధించారు. మొయినాబాద్‌లో 1,143 మంది పరీక్షకు హాజరు కాగా 1,028 మంది ఉత్తీర్ణత (89.94 శాతం) సాధించారు. గండిపేటలో 2,836 మంది పరీక్షకు హాజరు కాగా 2,566 మంది ఉత్తీర్ణత (90.48 శాతం) సాధించారు. శేరిలింగంపల్లిలో 6,266 మంది పరీక్షకు హాజరు కాగా 5,722 మంది ఉత్తీర్ణత (91.32 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలాపూర్‌లో 3,706 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,393 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
తెలుగులో 862 మంది విద్యార్థులు ఫెయిల్
హిందీలో 94, ఇంగ్లిష్‌లో 761 మంది..
పదో తరగతి ఫలితాల్లో వెల్లడి
అర్బన్ ఏరియాలో అధ్వానం
మాతృభాషపై కోల్పోతున్న పట్టు


