సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్‌కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కౌన్సిల్‌లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్‌కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. న్యూయార్క్, టోక్యో, లండన్ వంటి నగరాల్లో శక్తివంతమైన మేయర్ వ్యవస్థ వల్ల అభివృద్ధి సాధ్యమైందని ప్రస్తావించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో న్యూయార్క్, లండన్ వంటి నగరాలతోనే హైదరాబాద్ పోటీ అని ప్రస్తావించడం తెలిసిందే.
సిటీకి కొత్త కాదు..
హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్‌ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌కు ఒక ఓటు, మేయర్‌కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్‌లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. ప్రస్తుతం క్యూర్ పరిధిలోని కార్పొరేషన్లు, పోలీసు, వాటర్, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు వంటివి ఒకే ప్రాంగణంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.
క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ
నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యం..
కార్పొరేటర్‌కు ఒకటి, మేయర్‌కు మరో ఓటు
పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్


