డిచ్‌పల్లి (నిజామాబాద్‌రూరల్): రాష్ట్రస్థాయి బేస్‌బాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ద్వితీయ, నిజామాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. నల్లగొండ జిల్లా జట్టు ద్వితీయ, జనగామ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన 6వ రాష్ట్ర బేస్‌బాల్ సబ్‌జూనియర్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మే 24 నుంచి 28 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ అబ్జర్వర్ లింగన్న, రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


