ఇబ్రహీంపట్నం: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆయా కోర్సులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదనే నెపంతో విద్యార్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నాయని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్వీ చేపట్టిన పోరుబాట రెండోరోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇబ్రహీంపట్నంలో హైకోర్టు న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెయింట్ కళాశాల వద్ద జరిగిన ఆందోళనలో రాజ్‌కుమార్ మాట్లాడారు. ఉన్నత చదువులకు వెళ్లేందుకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల వద్ద ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల వేధింపులతో పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, విద్యార్థులను వేధించకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రవణ్, ప్రశాంత్, సుభాష్, రవి, ప్రసాద్, శంకర్, ప్రవీణ్, శివ పాల్గొన్నారు. మరో కళాశాల వద్ద జరిగిన ఆందోళనలో రాష్ట్ర నాయకుడు రంగోలి అరుణ్‌గౌడ్, విద్యార్థి నేతలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్


