నేడే తీన్‌మార్
174 పంచాయతీల్లో ఇప్పటికే పది ఏకగ్రీవం ఇబ్రహీంపట్నం, కందుకూరుడివిజన్లలో ఎన్నికలు పూర్తయిన పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ బ్యాలెట్ బాక్స్‌లతో గ్రామాలకు చేరుకున్న సిబ్బంది మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన
ఇబ్రహీంపట్నం: డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బంది
సాక్షి,రంగారెడ్డిజిల్లా/ఇబ్రహీంపట్నం: మూడో విడ త పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని 5 మండలాలు, కందుకూరు డివిజన్‌లోని 2 మండలాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికేపోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోసం 1,969 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,809 మంది ఓపీఓలు, 55 మంది జోనల్ అధికారులు, 42 మంది ఎఫ్‌ఎస్‌టీలు, ఎస్‌ఎస్‌టీలు, 193 మంది ఆర్‌ఓలు, 21 మంది మండల పర్యవేక్షణ అధికారులు, 22 ఎంసీసీ బృందాలు, 21 వ్యయ బృందాలు విధుల్లో పాల్గొంటున్నాయి.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 174 పంచాయతీలు, 1,598 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 10 సర్పంచ్ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు 559 మంది, 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 30 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 24 మంది మైక్రో అబ్జర్వర్లను ఇందు కోసం నియమించారు.
ఉప సర్పంచ్‌ల ఎన్నిక పక్రియ అదేరోజు
సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడి కాగానే ఉప సర్పంచ్‌ల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఒకవేళ అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజ ఉంటుంది. అప్పటికీ తేలకుంటే మరోమారు ఎన్నిక ప్రక్రియను చేపడతారు.
పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
మూడో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్క అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏ చిన్నపొరపాటుకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం మంచాల మండలంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించాారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. మొదటి, రెండో విడతలో ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన 125 మంది ఉద్యోగులపై ఇప్పటికే చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.
ఎన్నికలు జరగనున్న మండలాలు : 7
పోలింగ్ జరిగే పంచాయతీలు : 163
పోలింగ్ నిర్వహించే వార్డులు : 1,448
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 559
పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు : 4,091
పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట
ఎన్నికలు జరిగే మండలాలు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు
మూడో విడత పల్లె పోరుకు సర్వం సిద్ధం
నేడే తీన్‌మార్


