విభజనపై రగడ | - | Sakshi
Sakshi News home page

విభజనపై రగడ

Dec 17 2025 11:08 AM | Updated on Dec 17 2025 11:08 AM

విభజనపై రగడ

విభజనపై రగడ

గతంలో శివార్లలోని 12 మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మున్సిపాలిటీలకు రూ.400 – రూ. 500 కోట్ల స్పెషల్‌ఫండ్‌ ఇచ్చి సదుపాయాలు కల్పించారని, ఇప్పుడు కూడా అదేమాదిరి స్పెషల్‌ఫండ్‌ ఇవ్వాలని కొందరు సభ్యులు డిమాండ్‌ చేశారు. కొన్ని వార్డుల్లో అధిక జనాభా ఉన్నందున వాటిని రెండుగా చేయాలని కోరారు. శాసీ్త్రయంగా నిర్వహించాలన్నారు. మ్యాపుల్లో కాలనీల పేర్లుండాలన్నారు. ట్యాక్స్‌లకు సంబంధించి స్పష్టత నివ్వాలన్నారు. భౌగోళిక సరిహద్దులు, ఓటర్లు, జనాభా వివరాలు తెలపాలన్నారు. పెద్ద నగరాలకు కమిటీలు పంపి అధ్యయనం చేసి, డీలిమిటేషన్‌ చేయాలని సూచించారు. కొందరు పేర్ల మార్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇది అడ్డగోలు డీలిమిటేషన్‌ మేయర్‌కు సైతం తెలియకుండానే.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన సభ్యులు ఫిర్యాదులకు గడువు కావాలనిడిమాండ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌, మ్యాపులు చించేసిన బీజేపీ సభ్యులు ఈ ఘటనతో సమావేశాన్ని ముగించిన మేయర్‌

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ వార్డుల (కార్పొరే టర్ల డివిజన్ల) డీలిమిటేషన్‌పై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ అడ్డగోలుగా చేశారని, కనీసం మేయర్‌కు తైలియకుండానే చేయడంలో ఆంతర్యమేటని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యాల కోసం డీలిమిటేషన్‌ అని చెబుతూ.. ప్రజలు, ప్రజాప్రతినిధులకు సైతం తెలియకుండా గోప్యంగా, త్వరితంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రెండు పార్టీ లకు అనుకూలంగా ఉండేలా చేశారని ఆరోపించారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో డీలిమిటేషన్‌ చేశారంటూ బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో మేయర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ సభ్యులు డీలిమిటేషన్‌కు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌, మ్యాపుల పత్రాల్ని చించి సభలో విసిరేశారు. సభ ప్రారంభం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, సాయంత్రానికి తీవ్ర గందరగోళానికి దారి తీయడంతో మేయర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సభ్యుల అభ్యంతరాలు, సూచనలన్నీ నోట్‌ చేసుకున్న కమిషనర్‌ వాటిని సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివే దించాల్సిందిగా సూచించారు. సభ వాయిదా అనంతరం బీజేపీ సభ్యులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

విస్తీర్ణం పెరిగితే చాలదు

కేవలం గూగుల్‌ మ్యాపులు, ల్యాప్‌టాప్‌లతో పని చేశారని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (బీఆర్‌ఎస్‌) పునరుద్ఘాటించారు. దేశంలోనే పెద్దదిగా చూపేందుకు.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండా కేవలం విస్తీర్ణం పెంపుతోనే డీలిమిటేషన్‌ చేయడం తగ దన్నారు. కనీసం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు కూడా తెలియకుండా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. గతంలో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం జీవో జారీతో డీలిమిటేషన్‌ చేశా రని గుర్తుచేశారు. డీలిమిటేషన్‌ సైంటిఫిక్‌గా ఉండాలని, ప్రజాప్రతినిధులతో మేయర్‌ కానీ, కమిషనర్‌ కానీ మరోమారు సమావేశం నిర్వహించాలని కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ.. ఇది కేవలం పరిపాలనపరంగా తీసుకున్న నిర్ణయమని, 2011 తర్వాత జనాభా లెక్కలే సేకరించలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన వార్డులను విభజించారంటూ, ఇది ఎంఐఎంకు నష్టం కలిగించేందుకు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 12 మున్సిపాలిటీలు విలీనమయ్యాక రెండేళ్ల వరకు ఎన్నికలు జరగలేదని, ఆలోగా వందల కోట్లతో శివార్లలో మౌలికవసతుల పనులు జరిగాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్‌ వంగ మధుసూదన్‌రెడ్డి గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ, రాజీవ్‌గాంధీ తెచ్చిన 74వ రాజ్యాంగసవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజలతో, స్థానికసంస్థలతో సంబంధం లేకుండా చేస్తున్నారని తప్పుబట్టారు.

తీవ్ర అభ్యంతరాలు

పార్టీలకతీతంగా పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం కార్పొరేటర్లకు తెలియకుండా చేశారని, కొన్ని వార్డులు ముగ్గురి ఎమ్మెల్యేల పరిధిలోకి వెళ్లాయని, ఐదేళ్లుగా తాము ఎంతో కష్టపడి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రాంతాలు ఇప్పుడు తమ పరిధిలో లేకుండా పోతుండటంతో తమ ఓటర్లు మారి తమకు తీవ్ర నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వార్డునే కొత్తప్రాంతానికి మార్చడంతో తమ ముఖం ఎవరికి తెలుసని కొందరు ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వార్డులు, కొన్ని చోట్ల తక్కువ వార్డులు చేయడంపై కాంగ్రెస్‌–ఎంఐఎం పొత్తు ఉందని తమకు అనుమానంగా ఉందని బీజేపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీలకతీతంగా ప్రాథమిక నోటిఫికేషన్‌కు ముందుగానే సమావేశాలు నిర్వహించాల్సిందని, కమిటీలు వేయాల్సిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement