విజేతలెవరో?
పోటాపోటీగా ప్రచారం సాగించిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా జోరుగా తాయిలాల పర్వం స్థాయికి మించి ఖర్చు చేసిన వైనం అయినా విజయంపై లేని భరోసా ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ నేటితో తేలిపోనున్న భవితవ్యం
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఉంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజేతలెవరో తేలి పోనుంది.
అలుపెరుగని ప్రచారం
వారం రోజులుగా ఇంటింటికీ, గడపడపకూ తిరిగి అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టంలో ఎవ్వరినీ కాదనకుండా హామీల వర్షం గుప్పించారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు, ఆకట్టుకునేందుకు మందు, విందు, గిఫ్ట్‌లు, నగదు చెల్లింపులు చేశారు. ప్రత్యర్థి అంత ఇచ్చాడంటే దానికంటే కొంత ఎక్కువిచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ తాయిలాలు సమర్పించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు వెచ్చించినట్టు సమాచారం. పైకి గంభీరంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మత్రం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆందోళన వారిలో నెలకొంది.
ఆదరించేనా.. తిరస్కరించేనా..
లక్షలు ఖర్చు చేసినా ఓటర్లు తమను ఆదరిస్తారా.. అందలం ఎక్కిస్తారో లేదోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. శతవిధాలా ప్రయత్నించినా ఓటరు నాడిని మాత్రం పసిగట్టలేకపోయారు. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో.. ఓటరు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయోనని టెన్షన్‌తో గడుపుతున్నారు. ఏలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని రప్పించి ఓట్లు వేసేవిధంగా ఎవరికివారే ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రత్యేక సదుపాయాలు, ప్యాకేజీలు సమర్పించారు. కొన్నిచోట్ల తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. బుధవారం సాయంత్రంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్లు ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరికి పట్టం కడతారో తేటతెల్లం కానుంది.


