ప్రతీ క్షణం కీలకమే
అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
అబ్దుల్లాపూర్‌మెట్: మూడో విడతలో భాగంగా బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం నుంచే మొదలైన డబ్బు, మద్యం, మాంసం, తాయిలాల పంపిణీ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆతర్వాతి ప్రతీ క్షణం కూడా ఎంతో ముఖ్యమైనదని, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనేక అంశాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మేజర్ గ్రామపంచాతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులెవరూ ఖర్చుకు వెనకాడకుండా, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఆ ఊర్లలో నోట్ల వర్షం
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బలిజగూడ, ఇనాంగూడ, బాటసింగారం, జాఫర్‌గూడ, మజీద్‌పూర్, లష్కర్‌గూడ, దేశ్‌ముఖి, గుంతపల్లి, అనాజ్‌పూర్ గ్రామాల్లో ఓటర్లకు నోట్ల వర్షం కురుస్తోంది. బలిజగూడలో ఒక్కో ఓటరుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అందినట్లు తెలుస్తోంది. బరిలో ఉన్నవారందరూ లెక్క పెట్టకుండా డబ్బులు పంచడంతో ఓటర్ల పంట పండుతోంది. మజీద్‌పూర్‌లో వరుసకు తోటికోడళ్లు ముగ్గురు, జాఫర్‌గూడలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
యువత, వలస ఓట్లే కీలకం
మొదటి, రెండో దశ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో యువత, వలస ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపారు. తుది విడతలోనూ చాలా చోట్ల వారే కీలకంగా మారనున్నారు. దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము బలపర్చిన వారికే ఈ ఓట్లు పడేలా రాజకీయ పార్టీలు సైతం రంగంలోకి దిగాయి.


