పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే
హుడాకాంప్లెక్స్: వైకల్యమనేది శరీరానికే గానీ మనసుకు కాదని, సాధించాలనే తపన ఉండాలే గానీ ఏదైనా సాధ్యమే అని జిల్లా సంక్షేమాధికారి శ్రీలత అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ ప్రతిభాపాటవాలు చూపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. సుమారు 600 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనడం వారి మానసిక స్థైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరుగు పందెం, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో చిన్నారులు, పెద్దల కేటగిరీలుగా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన దివ్యాంగులు, వసతి గృహాల విద్యార్థులు, ఐసీడీఎస్ శాఖలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, డీఆర్‌డీఏ సిబ్బంది పాల్గొన్నారు.


