ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14, బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వ్యక్తితో పాటు తన బంధువును చూసేందుకు వచ్చిన మరో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉంచెపమ్ కాసర్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి కిచెన్‌లో పనిచేస్తున్నాడు. ప్రతి నాలుగైదు నెలలకోసారి తనకు ఫోన్ చేస్తుండేవాడని, గత 11 నెలలుగా ఫోన్ చేయడం లేదని అతడి సోదరుడు లియాచన్ కాసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారురు.
బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి సెప్టెంబర్ 21న రేగొండ గ్రామానికి చెందిన కొలెపాక ముగిలి (35) తన భార్యా పిల్లలను చూసేందుకు వచ్చాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీరువాలో భద్రపరిచిన నగలు చోరీ
ఫిలింనగర్: బీరువాలో భద్రపరిచిన నగలు చోరీకి గురైన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రోడ్డునెంబర్–12లోని శ్రీలక్ష్మీ నిలయంలో నివసించే డి.రమేష్ ఇంట్లో డైమండ్ నెక్లెస్‌తో పాటు ఆభరణాలు ఈ నెల 6న బీరువాలో భద్రపరిచారు. ఇటీవల నగల కోసం చూడగా కనిపించలేదు. కొత్తగా వచ్చిన పని మనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో..
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మైలార్‌దేవ్‌పల్లి: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ అబ్దుల్లా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాసీ్త్రపురం డైమండ్ హిల్స్‌లో ఉంటున్న షేక్ ఇమ్రాన్(38) అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన అతను ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాద మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోడిపందేల స్థావరంపై దాడి
మేడిపల్లి: కోడిపందేల స్థావరాలపై మేడిపల్లి పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచెర్ల మేకల మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దాడిచేసి 15మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రెండు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.18వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
1/1
ఇద్దరు వ్యక్తుల అదృశ్యం