పక్కాగా లెక్క!
● పంచాయతీ ఎన్నికల
వ్యయ పరిమితి ఖరారు
● జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు
● క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు
షాద్‌నగర్: పంచాయతీ సంగ్రామం మొదలైంది. బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వీలు లేదు. ఇందుకుగాను ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించింది. అభ్యర్థుల ఖర్చులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. లెక్కకు మించి ఖర్చు చేస్తే వేటు పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన అభ్యర్థులు ప్రచారానికి డబ్బులు ఖర్చు చేయాలి. సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలబడే అభ్యర్థులు బ్యాంకు ఖాతా వివరాలను నామినేషన్ పత్రాలతో పాటే సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ పట్టం ప్రకారం ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయకూడదు. ఐదు వేల లోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయకూడదు.
వివరాల నమోదు
అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రచారానికి ఖర్చును ఏ రూపంలో నిల్వ చేసుకున్నారో వివరాలను పొందుపరుస్తూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలి. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచార, వ్యయ పుస్తకాలను అందించడం, ఆ పుస్తకాల్లో ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయించాల్సి ఉంటుంది.
మూడు విడతలుగా తనిఖీలు
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు లెక్కలను పరిశీలిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు అధికారులు వ్యయాన్ని మూడు దఫాలుగా తనిఖీలు చేస్తారు. ఇందుకు అభ్యర్థులు ఖర్చులను పుస్తకాల్లో ఏ రోజుకారోజు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార శైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఇందుకు ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనుంది.
ఖర్చు మించితే వేటు తప్పదు
బరిలో నిలబడే అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన విధంగా ప్రచారానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రచార ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చూపించాలి. అభ్యర్థులు వ్యయ పరిమితి మించినా, ప్రచార ఖర్చుల లెక్కలు చూపించకపోయినా వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో గెలిచినా పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులూ జర జాగ్రత్త.
నిబంధనలు పాటించాలి
ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి. జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఖర్చును నిర్ణయించింది. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేయడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు లెక్కలు చూయించాలి.
– బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్‌నగర్
పక్కాగా లెక్క!


