శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
షాద్‌నగర్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ అన్నారు. శనివారం ఆయన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట, మొగిలిగిద్ద, చౌలపల్లి పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ మాట్లాడుతూ.. ప్రజలందరు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా నిఘాను పెంచాలని అన్నారు. కేంద్రాల వద్ద గుంపులను ప్రోత్సహించవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీసు బందోబస్తును పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రజలందరు అధికారులకు సహాకరించాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బది తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిగూడలో ఫ్లాగ్ మార్చ్
మొయినాబాద్‌రూరల్: ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా అభ్యర్థులు, నాయకులు పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకుల భయబ్రాంతులకు గురికాకుండా ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు శాంతియుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులే దేశానికి ఆదర్శం అని అందుకు నిజమైన నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు ఇష్టానుసారంగా ఓటు వేయాలని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకావొద్దని సూచించారు.
పట్టుబడిన మద్యం
కొందుర్గు: స్థానిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారులో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. లాల్‌పహాడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో రూ.5,525 విలువైన 34 కింగ్ ఫిషర్ బీర్లు లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు


