మున్సిపాలిటీల విలీనం సమంజసం కాదు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చెయ్యాలనే నిర్ణయాన్ని జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నిధుల కొరతతో జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 డివిజన్లలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కొత్తగా మరిన్ని మున్సిపాలిటీలను జోడించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 60 శాతం గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో ఏ విధంగా విలీనం చేస్తారని నిలదీశారు. జిల్లాకుఇన్‌చార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు రెండేళ్లలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు. అధికారం కోసం వెంపర్లాడి, అమలుకు అసాధ్యమైన హామీలు ప్రకటించి అధికారం చేజిక్కించుకొని, ఇప్పుడు ఆ హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే విలీన ప్రక్రియ అని విమర్శించారు. విలీనం చేస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో పన్నులు విధిస్తారనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన పలు రేడియల్ రోడ్లు నేటికీ పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనేక కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పలు అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలాంటి ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


