పహాడీషరీఫ్: ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన కుర్వ మహేశ్ ఇంటికి నారాయణపేటలో నివాసం ఉండే అతని తండ్రి భీంషప్ప(57) వచ్చివెళ్తుంటాడు. ఇతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఈనెల 18న ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. 20న ఉదయం 9.30 గంటలకు ఆరుబయట కూర్చునేందుకు వచ్చి, ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అతని కుమారుడు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పీఎస్‌లో లేదా 87126 62367 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఎవరీ బాలుడు
● తక్కళ్లపల్లి గేట్ వద్ద చేరదీసిన యాచారం పోలీసులు
● మేరీ హోమ్స్ సేఫ్ కస్టడీకి తరలింపు
యాచారం: నాగా ర్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై తక్కళ్లపల్లి గేట్ వద్ద శుక్రవారం ఓ మతిస్థిమితం లేని బాలుడి(13)ని స్థానిక పోలీసులు గుర్తించారు. వివరాలు అడిగే ప్రయత్నం చేయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అతన్ని సికింద్రాబాద్‌లోని (మేరీ హోమ్స్ ఫర్ ద డిసేబుల్డ్) సేఫ్ కస్టడీలో చేర్పించారు. లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, తెలుపు రంగు ప్యాంట్, నైక్ చెప్పులు ధరించి ఉన్నాడు. బాలుడిని ఎవరైనా గుర్తిస్తే యాచారం పోలీస్ స్టేషన్ నంబరు 8712662657కు ఫోను చేసి సమాచారం అందించాలని సీఐ నందీశ్వర్‌రెడ్డి సూచించారు.


