● అమెజాన్ సంస్థ ప్రతినిధి జాన్ నోబెల్
● నందివనపర్తి ఉన్నత పాఠశాల సందర్శన
యాచారం: అమెజాన్ సంస్థ ప్రతినిధి జాన్ నోబెల్ శుక్రవారం నందివనపర్తి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన తమ సంస్థ ద్వారా స్కూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై కెరీర్ గైడెన్స్, చదువు ప్రాముఖ్యత, విదేశాల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అమెజాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. సంస్థ ప్రతినిధులు లత, రాము, పాఠశాల హెచ్‌ఎం వెంకటరామశాస్త్రి, ఉపాఽ ద్యాయులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
శంకర్‌పల్లి: ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతాపూర్‌కి చెందిన వడ్ల బాలమణి(60) గురువారం వ్యక్తిగత పనులపై శంకర్‌పల్లికి వచ్చింది. సాయంత్రం చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


