నిఘా నేత్రాల కోసం ‘ఐస్’
రాజధానిలో ఉన్న సీసీ కెమెరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినవి, కమ్యూనిటీలు పెట్టిన వాటితో పాటు నేను సైతం పథకం కింద అమర్చినవి ఉన్నాయి. వీటిలో ఒక్కో రకం ఒక్కో విధమైన టెక్నాలజీతో కూడినవి.
–సాక్షి, సిటీబ్యూరో
ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో అనేకం పని చేయట్లేదు. కొన్ని నిత్యం మరమ్మతులకు లోనవుతున్నాయి. వీటిని గాడిలో పెట్టడానికి బయటి టెక్నీషియన్లపై ఆధారపడాల్సి వస్తోంది. సిటీలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు సైతం ఉన్నాయి. అయితే వీటి నిర్వహణను ప్రస్తుతం వేర్వేరు విభాగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ కారణంగానే సమన్వయం సహా అనేక అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిఘా నేత్రాల నిర్వహణకు ఎంపవరింగ్ యువర్ ఎవ్రీ డే సేఫ్టీ (ఐస్) పేరుతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలను ఒకే గొడుకు కిందికి తీసుకువస్తూ అడ్వాన్డ్‌స్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్ (ఏస్‌ఎస్జీపీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థకు రూపమిచ్చారు. వీటిని సజ్జనర్ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో గురువారం ఆవిష్కరించారు.
ఏస్‌ఎస్జీపీలో ఉండే, ఉండబోయే విభాగాలు ఇలా...
టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్ టీమ్:
నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసే సీసీ కెమెరాలతో పాటు సంబంధిత పరికరాల్లో యూనిఫామిటీ సాధించడం కోసం పని చేస్తుంది. ఇందులో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాలను అధ్యయనం చేస్తూ నగర అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది. ప్రధాన, ప్రతిష్టాత్మక టెక్నాలజీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను కనిపెడుతుంది.
కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్:
సీసీ కెమెరాల కోసమే ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పని చేస్తుంది. దర్యాప్తు అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు ఇస్తుంది. సీసీ కెమెరాల పని తీరుపై వచ్చే ఫిర్యాదులతో పాటు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారి వినతుల్నీ స్వీకరిస్తుంది.
ఐస్ టీమ్స్:
ఏదైనా సీసీ కెమెరాలో లోపం గుర్తించిన వెంటనే దాన్ని సరి చేయడానికి అంతర్గతంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి జోన్‌కు రెండు చొప్పున ఈ బృందాలు ఉండగా తొలి దశలో వీటి కోసం పది ద్విచక్ర వాహనాలు, నాలుగు తేలికపాటి వాహనాలతో పాటు ఓ క్రేన్‌ను కేటాయించారు. వీళ్లు అవసరమైతే ఆయా కాంట్రాక్టర్లతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తారు.
స్టోర్స్ అండ్ రిపేర్ సెంటర్:
ప్రతి మరమ్మతుకు బయటి వారిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కమిషనరేట్ కేంద్రంగా ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. లోపాలు ఉన్న సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్సులు తదితరాలకు ఇవి మరమ్మతులు చేస్తాయి. వీరికి అవసరమైన ఉపకరణాలు, స్పేర్ పార్ట్స్ సరఫరా చేయడానికి స్టోర్స్ టీమ్ సిద్ధంగా ఉంటుంది.
సీఎస్సార్ డెస్క్:
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్‌సీఎస్సీ) కలిసి సిటీ పోలీసులు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్ని సంప్రదిస్తుంటుంది. వారి నుంచి సీఎస్సార్ నిధులు పొంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. దీనికోసం ‘అడాప్డ్ ఎ కెమెరా’, ‘షేర్ ఎ లైవ్ ఫీడ్’ పేరుతో స్కీములు ఉన్నాయి.
డేటా అనలిటిక్స్ టీమ్:
వీరి వద్ద ఓ రియల్ టైమ్ డ్యాష్ బోర్డ్ ఉంటుంది. దర్యాప్తు అధికారులతో పాటు కీలక సందర్భాల్లో అవసరమైన ఫీడ్ ఇస్తుంది. కేసుల దర్యాప్తుతో పాటు నేరాల నిరోధంలో తనదైన పాత్రను పోషిస్తుంది. అవసరమైన సందర్భాల్లో వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ తదితర కీలక బాధ్యతలూ ఈ బృందానికి ఉన్నాయి.
ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసిన సిటీ కొత్వాల్


