ఆన్‌లైన్ లోన్ వేధింపులకు యువకుడి బలి
ఇబ్రహీంపట్నం: ఆన్‌లైన్ లోన్ నిర్వాహకులు పెట్టే వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన అచ్చిన నవీన్(23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని సిలింగ్ హుక్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికే అతని సోదరి గుర్తించి ఇరుగుపొరుగు వారికి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కిందికి దించారు. అప్పటికే నవీన్ మృతి చెందినట్లు గుర్తించారు. అతని మొబైల్ పరిశీలించగా ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకున్నాడని.. దీంతో లోన్ నిర్వాహకులు సందేశాలు పంపి వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


