రైతును రాజుగా చేయడమే లక్ష్యం
యాచారం: రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. గురువారం ఆయన యాచారం రైతువేదికలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని కూరగాయల సాగును పెంచాలని నిర్ణయించామని.. వచ్చే ఏడాది ఇందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో కూరగాయల సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. కూరగాయలు విక్రయానికి సరూర్‌నగర్ మార్కెట్‌కు తీసుకెళ్తే అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు బజార్‌లో కూరగాయలు విక్రయించేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాయితీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్, యంత్రాలు అందిస్తే సాగు విస్తీర్ణం పెంచుతామని చెప్పారు. రైతులు యూనిట్‌గా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయని కోదంరెడ్డి వివరించారు. అనంతరం కమిషన్ సభ్యులతో కలిసి ఆదర్శ రైతు కాశమల్ల రాములు డ్రిప్ పద్ధతిలో చేపట్టిన వరిసాగును పరిశీలించి అభినందించారు.
భూసమస్యలపై నిర్లక్ష్యం వద్దు
ఎన్ని చట్టాలు తెచ్చిన రైతుల భూసమస్యలు తీరడం లేదని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల నుంచి తిరుగుతున్నా తమ భూ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని గాండ్లగూడెం, మల్కీజ్‌గూడ, యాచారం రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. వెంటనే కోదండరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ కీర్తిసాగర్‌ను పిలిచి భూసమస్యలు తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు. పెద్ద గుట్టను ధ్వంసం చేయడం గమనించిన ఆయన వెంటనే పనులు నిలిపేయాలని ఉప తహసీల్దార్‌కు సూచించారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి, భవాని, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేశ్, మార్కెటింగ్ అధికారి రియాజ్, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, రైతులు సురేందర్‌రెడ్డి, వెంకటేశ్ నాయక్, నర్సింహ, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.
కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు
వచ్చే ఏడాది జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటాం
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి


