గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
కడ్తాల్: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన శేరి చిన్నయ్య(60) కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తన బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిమీద శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సందర్శిని హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం చిన్నయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి క్లూస్‌టీం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్
వ్యక్తి దుర్మరణం
నందిగామ: స్కూటీని వెనకాల నుంచి టిప్పర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దుద్యాల్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(43) శుక్రవారం కొత్తూరు నుంచి నందిగామ వైపునకు తన స్కూటీపై పాత జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో మండల కేంద్రం శివారులో వెనకాల నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు టిప్పర్ డ్రైవర్ షేక్ మహమ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపాలి
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని బాచారం, బండరావిరాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ధాన్యం సేకరణను ప్రత్యేక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేస్తూ రైస్ మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటలలోపే రైతులకు చెల్లింపులు జరగాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపించాలని, తూకం వేసి మిషన్లు, గన్ని బ్యాగులను టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని జయలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ వెంట డీసీఎస్‌ఓ వనజాత, డీఎంఓ హరీశ్, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డిలతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి


