బిజినెస్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: పాస్‌పోర్టు, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ జాన్ కెన్నెడీ చుక్‌ఉమెకా ఓక్రోను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు శుక్రవారం డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపారు. బిజినెస్ వీసాపై వచ్చిన ఇతగాడు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ప్రకటించారు. ఓక్కో 2012లో బిజినెస్ వీసా పైన ముంబై వచ్చి కొంతకాలం వస్త్ర వ్యాపారం చేశాడు. తన వీసాతో పాటు పాస్‌పోర్టు గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉంటూ తరచూ బెంగళూరు, హైదరాబాద్‌లకు రాకపోకలు సాగించే అతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం డ్రగ్స్ దందాలో దిగి పెడ్లర్‌గా మారాడు. ఇటీవల ఆసిఫ్‌నగర్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతూ హెచ్–న్యూకు చిక్కాడు. ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామి, ఎస్సై బి.మనోజ్ కుమార్‌లతో కూడిన బృందం అతడిని విచారించిన నేపథ్యంలో వివరాలు బయటపడ్డాయి. దీంతో ఓక్రోను నిర్భంధించి, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సాయంతో డిపోర్టేషన్‌కు అవసరమైన పత్రాలు పొందారు. వీటి ఆధారంగా శుక్రవారం నైజీరియాకు బలవంతంగా తిప్పి పంపారు. ఇతడితో కలిపి ఇప్పటి వరకు హెచ్–న్యూ విభాగం మొత్తం 22 మంది విదేశీయులను డిపోర్ట్ చేసింది.
2012 నుంచి సాగిస్తున్ననైజీరియన్ ఓక్రో
వలపన్ని పట్టుకున్నహెచ్–న్యూ అధికారులు
ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ సహాయంతో డిపోర్టేషన్ ప్రక్రియ


