ఎజాజ్ ‘పిలిస్తే’ నైజీరియన్లూ ‘పలుకుతారు’!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదిన ఉన్న మెట్రో నగరాల్లో డ్రగ్స్ సప్లయర్స్‌గా ఉన్న నైజీరియన్లు ఏ పెడ్లర్‌కీ కనిపించరు. కేవలం సోషల్‌మీడియా సంప్రదింపులతో, డెడ్ డ్రాప్ విధానంలో పని పూర్తి చేస్తారు. అయితే బెంగళూరులో స్థిరపడిన ఘరానా పెడ్లర్ ఎజాజ్ అహ్మద్‌కు ఉన్న డిమాండే వేరు. ఇతడు ఫోన్ చేస్తే పెద్ద పెద్ద సప్లయర్స్‌గా ఉన్న నల్లజాతీయులు ఇంటికి వచ్చి మరీ సరుకు ఇచ్చి వెళ్తారు. నగరంలో ఉన్న కస్టమర్‌కు డ్రగ్స్ డెలివరీ చేయడానికి వచ్చిన ఈ పెడ్లర్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు (హెచ్–న్యూ) చిక్కినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఆదివారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.12 లక్షల విలువైన నాలుగు రకాలైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
బీటెక్ మధ్యలో ఆపేసి...
బిహార్‌కు చెందిన ఎజాజ్ తండ్రి బడా సివిల్ కాంట్రాక్టర్. ఈ నేపథ్యంలోనే వీరి కుటుంబం కర్ణాటక–గోవా సరిహద్దుల్లో ఉన్న కార్వార్ ప్రాంతంలో స్థిరపడింది. బీటెక్ విద్యనభ్యసించడం కోసం ఎజాజ్ బెంగళూరుకు వచ్చారు. ఫోర్త్ ఇయర్ చదువుతూ మధ్యలోనే మానేసిన ఇతగాడు సివిల్ కాంట్రాక్టర్‌గా మారాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన ఈ వ్యాపారంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డాడు. ఆపై నష్టాలు రావడంతో తన తండ్రితో కలిసి ఆయన కాంట్రాక్టులు చూసుకున్నాడు. 2020లో అమలైన లాక్‌డౌన్ సందర్భంలో స్నేహితుల రూమ్‌కు పరిమితమయ్యాడు. అక్కడ వారితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు.
కస్టమర్ నుంచి పెడ్లర్‌గా మారి...
కొన్నాళ్లకు తానే స్వయంగా నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించాడు. అప్పటికే తన విలాసాలకు అవసరమైన డబ్బు తేలిగ్గా సంపాదించడానికి అనువైన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అప్పుడే ఇతడికి తానే పెడ్లర్‌గా మారి కస్టమర్లకు సరఫరా చేస్తే లాభాలు ఉంటాయనే ఆలోచన వచ్చింది. ఇతడు కస్టమర్‌గా ఉండగా ఫోన్ చేసిన వెంటనే నైజీరియన్లు డ్రగ్స్ తీసుకువెళ్లి ఇంటి వద్ద ఇచ్చి వచ్చే వాళ్లు. అదే విధానం కొనసాగిస్తూ మాదకద్రవ్యాలు ఖరీదు చేస్తూ... బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో ఉన్న కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. సోషల్‌మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తానే నేరుగా వచ్చి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలో లేదంటే కొరియర్ ద్వారా సరఫరా చేసేవాడు.
బస్టాండ్‌లో ఉండి బైక్ ట్యాక్సీల ద్వారా...
కొన్నిసార్లు సరుకుతో హైదరాబాద్ వచ్చే ఎజాజ్ తాను బస్సు దిగిన చోటే ఉండేవాడు. అక్కడ నుంచి కస్టమర్‌కు బైక్ ట్యాక్సీ ద్వారా సరుకు పంపిస్తుండేవాడు. కొరియర్ చేయాల్సి వస్తే వివిధ కాగితాల మధ్యలో ఈ డ్రగ్ ఉంచి పంపేవాడు. నగదు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో జరిగేవి. ఇతడు సరుకు తీసుకుని నగరానికి వస్తున్నాడని హెచ్–న్యూకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్‌ఐ సి.వెంకట రాములు తమ బృందంతో మాసబ్‌ట్యాంక్ వద్ద కాపుకాశారు. ఎండీఎంఏ, కొకై న్, ఓజీ ఖుష్, ఎక్స్‌టసీ పిల్స్‌తో వచ్చిన ఎజాజ్‌ను మాసబ్‌ట్యాంక్ పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఇతడు బెంగళూరులో ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఓ గెటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్‌లో నెలకు రూ.70 వేల అద్దెకు నివసిస్తున్నాడు. నైకీ బూట్లు, బఫెల్లో జీన్స్‌లు, ఎడిడాస్ టీషర్టులు మాత్రమే వాడుతుంటాడు. ఇతడి వినియోగదారులతో పాటు సప్లయర్లుగా ఉన్న నైజీరియన్లను గుర్తించడంపై హెచ్–న్యూ దృష్టి పెట్టింది.
అలవాటుపడిన వాళ్లూ విక్రేతలు అవుతున్నారు
విద్యార్థులు, ఉద్యోగుల్లో అనేక మంది మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడి... అందుకు అవసరమైన డబ్బు కోసం వాళ్లే పెడ్లర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజానికి పెను ముప్పు పొంచి ఉంది. ఇలాంటి వారిపై కన్నేసి ఉంచాలని కోరుతున్నాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాలపై సమాచారం తెలిస్తే 8712661601కు ఫోన్ చేసి తెలపండి. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతాం.
– వైవీఎస్ సుధీంద్ర, డీసీపీ
నగరానికి నాలుగు రకాలైన మాదకద్రవ్యాల సరఫరా
డెలివరీ కోసం వచ్చి హెచ్–న్యూకు పట్టుబడిన వైనం
రూ.12 లక్షల విలువైన 7.7 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
