భూములు తీసుకోకుండా చూడండి
యాచారం: తమ భూములను సర్కార్ సేకరించకుండా చూడాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు వేడుకున్నారు. తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం వారు ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలోని 600 మందికి పైగా రైతులకు చెందిన 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసమని సేకరించడానికి సర్కార్ నోటిఫికేషన్ వేసింది. ఆ భూములు తీసుకుంటే గ్రామంలోని ప్రతి కుటుంబం ఉపాధి కోల్పోతుందని తెలియజేశారు. అధికారులేమో కచ్చితంగా ఆ భూములు తీసుకుంటామని అంటున్నారు, అసైన్డ్ భూమి ఎకరాకు రూ.22 లక్షల పరిహారం, 121 గజాల ప్లాటు ఇస్తామని అంటున్నారు. యాచారం మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లిలో ఎకరాకు రూ.కోటిన్నరకు పైగానే డిమాండ్ ఉంది. కానీ రూ.22 లక్షల పరిహారం ఇస్తే ఎట్లా అని ఎమ్మెల్యేకు తెలియజేశారు. వెంటనే ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డికి ఫోను చేసి పరిహారం చెల్లింపు విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు. క్యాంపు కార్యాలయంలోనే రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. న్యాయమైన పరిహారం చెల్లింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రంగారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన మొండిగౌరెల్లి రైతులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
