
రూ.13 కోట్లు ఫట్!
సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 72,549 వీధిదీపాలు లేకుండానే వాటి ఏర్పాటు, నిర్వహణ పేరిట కాంట్రాక్టు ఏజెన్సీకి నిధులు చెల్లించారు. ఈ అవినీతి తంతు ఏకంగా ఏడేళ్లు సాగింది. ఇవి ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణకు గాను జీహెచ్‌ఎంసీ ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్)కు గత ఏప్రిల్ నెలాఖరు వరకు ముగిసిన ఏడేళ్ల కాంట్రాక్టు కాలంలో చెల్లించిన నిధులు. ఒక్కో వీధిదీపం నిర్వహణకు నెలకు రూ.22 వంతున ఏడేళ్ల కాలానికి దాదాపు రూ.13,40,70,552 చెల్లించారు. ఇవి కేవలం నిర్వహణ పేరిట. ఇక వీధిదీపాల ఏర్పాటు ఖర్చు మరింత అ‘ధనం’. ఎంతో కాలంగా నగరంలో కారుచీకట్లు అలుముకున్నా, ఒప్పందం మేరకు 98 శాతం వీధిదీపాలు వెలగకున్నా, ఈఈఎస్‌ఎల్‌పై జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు జీహెచ్‌ఎంసీ తమకు కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందంటూ ఈఈఎస్‌ఎల్ ప్రచారం చేసుకుంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు డ్యాష్‌బోర్డు పని చేయకున్నా, సీసీఎంఎస్ (సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లు పని చేయకున్నా జీహెచ్‌ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు.
తప్పుడు లెక్కలు
ఈఈఎస్‌ఎల్ ఒప్పందం ముగియడానికి ముందు.. తిరిగి వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు కొత్తగా ఎవరికివ్వాలన్న అంశం చర్చకు రాగా, అప్పటి కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అసలు నగరంలో వాస్తవంగా ఉన్న వీధిదీపాలెన్నో లెక్క తీయాలని భావించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించగా, 4,77,539 వీధిదీపాలు మాత్రమే లెక్క తేలాయి. ఒప్పందం ప్రకారం 5,50,088 వీధిదీపాలు ఏడేళ్లపాటు వెలుగులు విరజిమ్మాలి. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసేంత వరకు కూడా అసలెన్ని వీధిదీపాలున్నాయో, ఎన్ని వెలిగాయో కూడా చూడకుండానే చెల్లింపులు చేశారంటే నిజంగా నిద్రపోయారా, లేక నిద్ర నటించి అవినీతిని ప్రోత్సహించారా? అన్నది జీహెచ్‌ఎంసీకే తెలియాలి.
పర్యవేక్షణ లేమి..
● జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారు. ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి అందుతున్న ఫిర్యాదుల్లో సింహభాగం వీధిదీపాలవే అయినా సమస్యను పరిష్కరించలేకపోయారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లలో ఇప్పటికీ 50 శాతం వీధిదీపాలు వెలగడం లేవు. పేరెన్నికగన్న దుర్గంచెరువు బ్రిడ్జిమీద సైతం నెలలో సగం రోజులు చీకట్లే అలుముకుంటున్నాయి. ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ తప్ప నిజంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫిర్యాదు చేసేందుకు ప్రజలు కార్యాలయాలకు వెళ్లినా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు తప్ప సంబంధిత ఇంజినీర్లు కనిపించరు. అదేమంటే క్షేత్రస్థాయి విధులకు వెళ్లారని చెబుతారు. కానీ, వారు క్షేత్రస్థాయిలోనూ కనిపించరు.
● పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ సైతం ఫోన్లు చేసి చెప్పి ఆపరేటర్ల ద్వారానే వేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల వరకు క్షేత్రస్థాయి విధులు నిర్వహించాల్సిన ఇంజినీర్లు దాదాపు 7 గంటల సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్నట్లు సంబంధిత వాట్సాప్ గ్రూపు లో ఒక ఫొటో పెడుతూ ఉన్నతాధికారులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. జెన్‌కో నుంచి వచ్చిన డీఈఈ స్థాయి వారికే సదుపాయాలతో కలిపి ఏటా దాదాపు రూ. 50 లక్షల జీతం చెల్లిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదు. ఏడేళ్లు దాటినా వీధిదీపాల లెక్కలే సరిగ్గా లేవంటే పనితనం అంచనా వేసుకోవచ్చు.
తాత్కాలికం పేరుతో..
పండుగలు, ప్రత్యేక దినోత్సవాల పేరిట ఆయా సందర్భాల్లో తాత్కాలిక వీధిదీపాల పేరుతో ఏటా దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి నగరమంతా ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణ అన్నప్పుడు విడిగా మళ్లీ తాత్కాలికం పేరిట నిధుల ఖర్చెందుకో అర్థం కాదు. ప్రత్యేక సందర్భాల్లో రంగుల కాంతుల వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చు కానీ.. వీధిదీపాలు తాత్కాలికం ఏమిటో అంతుపట్టదు. వివిధ పనుల్లోనూ అవినీతి చేతివాటం ఎంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ పోల్స్ మార్చడం తదితర పనులకు కాంట్రాక్టర్లు 60 శాతం లెస్‌కు టెండర్లు వేస్తున్నారంటే, వాటి వెనుక అవినీతి ఎంతో అంచనా వేసుకోవచ్చు.
దారి మళ్లుతున్న కేబుల్?
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ జోన్లలో అవసరం లేకున్నా కేబుల్ తదితర సామగ్రి భారీగా కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ వినియోగించారో, ఏంచేశారోలెక్కాపత్రం ఉండదు. వక్రమార్గంలో అవి ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం అవుతాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ, ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని సమాచారం.
వెలుతురు వెనుక అవినీతి చీకటి?
ఎల్‌ఈడీ వీధిదీపాల పేరిట లూటీ
ఏడేళ్లు సాగిన అక్రమాల తంతు
కళ్లు మూసుకున్న బల్దియా
వస్తే .. కదలరు
ఇతర విభాగాల నుంచి జీహెచ్‌ఎంసీకి వచ్చే అధికారులు గరిష్టంగా ఐదేళ్ల వరకు డిప్యుటేషన్‌లో కొనసాగవచ్చు. విద్యుత్ విభాగంలో పని చేస్తున్న ఇంజినీర్లు మాత్రం ఆ కాలపరిమితి దాటినా కొనసాగుతున్నారు. బాధ్యతల అప్పగింతలోనూ వివక్ష కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. కొందరు ఈఈలకు ఒక్క సర్కిల్ పర్యవేక్షణ మాత్రమే ఉండగా, కొందరికి ఆరేడు సర్కిళ్లు కూడా ఉండటం వెనుక మతలబు ఏమిటో సంబంధీకులకే తెలియాలి మరి.

రూ.13 కోట్లు ఫట్!