
స్తంభాన్ని తొలగించిన మున్సిపల్ సిబ్బంది
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్దలో ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ లైట్ల స్తంభాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం తొలగించారు. ఇటీవల సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దామరగిద్ద వార్డు నుంచి రజినీకాంత్ నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ఇనుప స్తంభాలను తొలగించాలని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన చేవెళ్ల మున్సిపల్ అధికారులు స్తంభాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృసి చేస్తున్నట్లు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల
సమస్యలు పరిష్కరించాలి
టీపీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్
ఇబ్రహీంపట్నం: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీపీఎస్‌ఏ(తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేయబడిన కార్యదర్శులకు మొదటి నియామకమైన 2019 ఏప్రిల్ 11 నుంచి వర్తింపులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జిల్లాలో ఓపీఎస్ క్యాటగిరీలో విధులు నిర్వహిస్తున్న వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్షన్ చేయాలని, పెండింగ్ జీతభత్యములు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవేందర్, దీపిక, నయీం, గౌస్, నవీన్‌యాదవ్, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల వ్యవసాయ
అధికారిగా శ్రీలత
మంచాల: మండల వ్యవసాయాధికారిగా ఎ.శ్రీలత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన కృష్ణమోహన్ డిప్యూటేషన్‌పై షాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో కడ్తాల్ నుంచి శ్రీలత డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలున్న రైతులు నేరుగా కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

స్తంభాన్ని తొలగించిన మున్సిపల్ సిబ్బంది