ప్రమాద బీమా.. ఆరోగ్య ధీమా
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● 5వేల మందికి రూ.5 లక్షల ప్రమాదబీమా పత్రాలు పంపిణీ ● ఉచిత వైద్యసేవలు అందిస్తామన్న చెలిమెడ లక్ష్మీనర్సింహారావు
సిరిసిల్ల: అసంఘటిత రంగంలోని ఆటో డ్రైవర్లకు రూ.5లక్షల ప్రమాద బీమాతోపాటు చెలిమెడ ఆ నందరావు వైద్యవిజ్ఞాన సంస్థలో ఆరోగ్యధీమా కూడా లభించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో బుధవారం 5వేల మంది ఆటోకార్మి కులకు ప్రమాదబీమా పత్రాలను కేటీఆర్ పంపిణీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ వీర్నపల్లికి చెందిన ఆటోడ్రైవర్ సతీశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సమయంలో పరామర్శించానని, అప్పుడే ఈ బీమా పథకానికి ఆలోచన వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ప్రభుత్వమే బీమా చేయించిందని, ఇప్పుడు ఆ పథకం లేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్రాంతిలోగా వ్యాన్లు, గూడ్స్ ఆటోలు, కార్లు, జీపుల డ్రైవర్లకు బీమా చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఉచిత వైద్యం
జిల్లాలోని ఆటో డ్రైవర్లకు గుర్తింపుకార్డులు ఇచ్చి, కరీంనగర్‌లోని తమ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తామని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆటో నడిపితే రూ.వెయ్యి నుంచి రూ.1500 వచ్చేవని, ఇప్పుడు ఉచిత బస్సుతో రూ.300 రావడం కష్టంగా ఉందన్నారు. జిల్లాలో 12వేలు ఆటోలు ఉండేవని, ఇప్పుడు 5వేలకు తగ్గాయన్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో ట్యాక్స్‌లు రద్దు చేస్తే.. కాంగ్రెస్ పాలనలో బీమా పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, సిరిసిల్ల మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, ఆకునూరి శంకరయ్య, కుంబాల మల్లారెడ్డి, కార్మిక నాయకులు వెంగళ శ్రీనివాస్ పాల్గొన్నారు.
శవాన్ని తెప్పించాలని కేటీఆర్‌కు వినతి
ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లిచెరువుతండాకు చెందిన గుగులోత్ రవి ఇటీవల సౌదీఅరేబియాలో గుండెపోటుతో మరణించాడు. విజిటింగ్ వీసాపై వెళ్లిన రవి శవాన్ని ఇండియాకు తెప్పించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు మంజుల, చక్రీ, హరిసింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ కాళ్లపై పడ్డారు. శవాన్ని తెప్పిస్తానని కేటీఆర్ చెప్పారు.
కొడుకును స్వదేశానికి రప్పించండి


