గడువులోగా గగనమే ! | - | Sakshi
Sakshi News home page

గడువులోగా గగనమే !

Jun 30 2025 3:48 AM | Updated on Jun 30 2025 3:48 AM

గడువు

గడువులోగా గగనమే !

● ఈనెలాఖరులోగా సగం బట్ట ఉత్పత్తి అసాధ్యం ● ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు 4.30కోట్ల మీటర్లు ● ఇప్పటికీ ఉత్పత్తి 80 లక్షల మీటర్లు ● ఇంకా 3.50 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయాలి ● కార్మికుల కొరత.. నాణ్యత మెలిక

సిరిసిల్ల: మహిళా శక్తి చీరల ఉత్పత్తి నత్తకు నడక నేర్పేలా సాగుతోంది. ఈనెలాఖరులోగా సగం లక్ష్యం పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. సిరిసిల్లలో 131 మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌) సంఘాల పరిధిలో 27వేల మరమగ్గాలు ఉండగా.. 6972 సాంచాలపైనే చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. మిగతా సాంచాలపై పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా.. స్థానికంగా కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినా సరిపోవడం లేదు. దీంతో నిత్యం సిరిసిల్లలో 9.85 లక్షల మీటర్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4.18 లక్షల మీటర్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 17న కలెక్టరేట్‌లో రాష్ట్ర చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్య వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. ఈనెలాఖరులోగా 50 శాతం పూర్తి చేసిన సొసైటీలకే ఆర్డర్‌ ఇస్తామని స్పష్టం చేశారు. అయితే చీరల ఉత్పత్తి తీరును పరిశీలిస్తే ఈనెలాఖరులోగా 25 శాతం ఉత్పత్తి కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కార్మికుల కొరత

సిరిసిల్లలో నేతకార్మికుల కొరత వేధిస్తోంది. ఇటీవల స్థానిక వస్త్రపరిశ్రమలో సంక్షోభంతో చాలా మంది నైపుణ్యం గల కార్మికుల ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసిన వారు కూడా స్థానికంగా ఉపాధి లేక వారి స్వస్థలాల్లోనే పనులు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక వస్త్రపరిశ్రమలో నైపుణ్యం గల కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. చాలీచాలని వేతనాలతో స్థానిక కార్మికులు సైతం వస్త్రోత్పత్తి పనికి రావడం లేదు. గతంలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన కార్మికులకు 10 శాతం యారన్‌ సబ్సిడీని అందించారు. అప్పట్లో అందరికీ ఈ సబ్సిడీ ఇవ్వడంతో ఆసక్తిగా బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేశారు. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కూలీలకు కేవలం మీటరుకు రూ.5.25 కూలీ చెల్లిస్తున్నారు. 10 శాతం యారన్‌ సబ్సిడీ వర్తించడం లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల కార్మికులు తప్ప స్థానికులు పనికి రావడం లేదు.

ఆగస్టులో చీరల పంపిణీ అసాధ్యమే..

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలను ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది ఆగస్టు 8న చేనేత దినోత్సవం రోజు ప్రకటించారు. ఆ మేరకు ఈ ఏడాది ఆగస్టులో చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుండగా.. చీరల బట్ట పూర్తిస్థాయిలో ఉత్పత్తి అసాధ్యంగా కనిపిస్తుంది. కనీసం ఒక్క చీరనైనా అందించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన చీరల బట్టను ప్రాసెసింగ్‌ చేసి, రంగుల్లో ప్రింటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలంటే మరో నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు.

నాణ్యతపై తనిఖీలు

ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణను ఈనెల 23న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రారంభించారు. ఆసాముల వద్ద ఉత్పత్తి అయిన బట్టను యజమానులు సేకరించే సమయంలోనే డ్యామేజీ లేకుండా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ గోదాములోనూ చీరలబట్టను అన్ని కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. 48 ఇంచుల వెడల్పుతో ఉండేలా చూస్తున్నారు. డిజైన్లు సరిగా వస్తున్నాయో లేవో కూడా చెక్‌ చేసుకోవాలంట్నున్నారు. గతంలో కంటే నాణ్యమైన చీరల ఉత్పత్తి జరుగుతున్నా గడువులోగా లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తుంది.

చీరల బట్ట ఆర్డర్ల స్వరూపం

మొదటి ఆర్డర్‌ .. జనవరిలో 2.12 కోట్ల మీటర్లు

రెండో ఆర్డర్‌ .. మార్చిలో 2.18 కోట్ల మీటర్లు

ప్రస్తుతం నడుస్తున్న సాంచాలు 6,972

ఉత్పత్తి అయిన చీరల బట్ట 80 లక్షల మీటర్లు

గోదాముకు చేరిన వస్త్రాలు 10 లక్షల మీటర్లు

నిత్యం ఉత్పత్తి అవుతున్న బట్ట 4.18 లక్షల మీటర్లు

నిత్యం ఉత్పత్తి చేయాల్సిన లక్ష్యం 9.85 లక్షల మీటర్లు

జూన్‌ నెలాఖరులోగా ఉత్పత్తి అయ్యేది కోటి మీటర్లు

గడువులోగా గగనమే !1
1/2

గడువులోగా గగనమే !

గడువులోగా గగనమే !2
2/2

గడువులోగా గగనమే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement