
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్‌కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు.