
గోవులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
● జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడఅర్బన్: రాజన్న గోశాలలోని కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, సౌకర్యాలను పరిశీలించి, వాటి సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడతూ ఎండాకాలం నేపథ్యంలో గోవుల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలన్నారు.
గోవుల వయసు ఆధారంగా...
గోవుల వయసు ఆధారంగా వాటిని వివిధ షెడ్‌లలో పెట్టాలని, గోశాలలోని షెడ్లలో ఫాగర్స్(నీటి తుంపర్ల) యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గోవులకు సరిపడా పచ్చిగడ్డిని మరింత అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ పరికరం పెట్టాలని సూచించారు. అనంతరం గోవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఆలయ ఈవో వినోద్, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.