
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్‌గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనం!!