
అంజన్నా.. నీడ లేదన్నా..
మల్యాల(చొప్పదండి): ఎండల తీవ్రతకు కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని సేద తీరేందుకు నీడ కరువైంది. ఆలయ పరిసరాల్లో మాత్రమే చలువ పందిళ్లు వేశారు. వై జంక్షన్ నుంచి ఆలయ సమీపం వరకు సుమారు మూడు వందల మీటర్ల దూరం నడిచి వెళ్లాలి. ఆ ప్రాంతంలో చలువ పందిళ్లు లేక ఎండకు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు తిప్పలు తప్పడంలేదు.
కాలినడకన వచ్చే భక్తుల ఇబ్బంది
కొండగట్టులో ఆలయ సమీపం వరకు వాహనాలు వెళ్తుండడంతో కాలినడక వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాహనాలను ఆలయ సమీపంలోకి అనుమతించకూడదని, వికలాంగులు, వృద్ధులకు సంబంధించి వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు.
అక్కడక్కడ మాత్రమే పందిళ్లు
వేసవి సెలవులు ప్రారంభం నుంచి రోజురోజుకు ఆంజనేయస్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరుగుతోంది. కాగా, భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ సమీపంలో నీడ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ ప్రధాన, వెనక ద్వారంతో పాటు ఆలయ కార్యాలయం ఎదుట, తాత్కాలిక అన్నదానం సత్రం వద్ద కొంతమేర చలువు పందిళ్లు ఉన్నా భక్తులకు సరిపోవడం లేదు.
వై జంక్షన్ నుంచి..
అంజన్న దర్శనానికి వచ్చేవారి కోసం వై జంక్షన్ సమీపంలోని ఆలయ తోరణం నుంచి చలువు పందిళ్లు వేయాలని భక్తులు కోరుతున్నారు. కాలినకడన వెళ్తున్న భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ ద్వారం వరకు చెప్పులతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆలయ పరిసరాల్లో అక్కడక్కడే చలువ పందిళ్లు
ఎండకు భక్తుల ఇబ్బంది
వై జంక్షన్ నుంచి దారి పొడవునా చలువ పందిళ్లు వేయాలని భక్తుల వేడుకోలు

అంజన్నా.. నీడ లేదన్నా..