
ఉగ్రవాదమే ప్రధాన సమస్య
జగిత్యాలటౌన్: ఉగ్రవాదమే మనదేశం ముందున్న ప్రధాన సమస్య అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్‌ను అణిచివేసే చర్యలు చేపట్టాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలువడం హర్షించదగిన పరిణామమన్నారు. మల్లికార్జన ఖర్గే, రాహుల్‌గాంధీతోపాటు ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. దేశ జాతీయత, ఐక్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టాలన్నారు. మేధావులు, ప్రజాసంఘాలు విజ్ఞప్తి మేరకు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయుధాలు పట్టిన వారితో శాంతిచర్చలు జరపాలని కోరారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, ధర రమేష్, జున్ను రాజేందర్, చందారాదాకిషన్, బీరం రాజేష్, గుండ మధు తదితరులు ఉన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి