
పరీక్షలపై ప్రతిష్టంభన
● డిగ్రీ విద్యార్థుల్లో ఆందోళన ● పరీక్షలపై కాలేజీ యాజమాన్యాల సహాయ నిరాకరణ ● గడువు ముగిసినా పరీక్ష ఫీజులు చెల్లించని వైనం ● ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలని విన్నపం
సిరిసిల్లకల్చరల్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణకు ముందుకొస్తామని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు.. ముందుగా పరీక్ష ఫీజు చెల్లించండి అని యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనల మధ్య అసలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు పూర్తికాగా.. శాతవాహన పరిధిలో డిగ్రీ పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది. డిగ్రీ చివరి సెమిస్టర్ విద్యార్థులు మాత్రం తాము పోటీపరీక్షలకు అనర్హులమ వుతామని.. పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
ఏడాదిగా సాగుతున్న ఫీజు పోరు
గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడున్నరేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాలేదు. కళాశాలల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు అప్పు చేయాల్సిన పరిస్థితులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల్లో జాప్యంతో అధ్యాపకులకు వేతనాలు, భవనాలకు అద్దెలు, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక ప్రైవేట్ కాలేజీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, మంత్రులకు ఎన్నో సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గత్యంతరం లేని స్థితిలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సహాయ నిరాకరణకు దిగాయి. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినా యాజమాన్యాలు యూనివర్సిటీకి మాత్రం చెల్లించలేదు. ఈమేరకు శాతవాహన వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు లేఖలు అందించారు.
మే 14 నుంచి పరీక్షలు
ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు విడుదల చేస్తేనే ఫీజులు చెల్లిస్తామని, అప్పటి వరకు పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదని శాతవాహన ప్రైవేట్ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(సుప్మా) నిర్ణయించింది. వైస్‌చాన్స్‌లర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని భావించినా పరీక్ష ఫీజు చెల్లిస్తేనే చర్చలకు అవకాశం ఉంటుందని వీసీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తే తప్ప విద్యార్థుల ఆందోళనకు తెరపడే అవకాశం లేదు. కాగా కొత్త విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ ప్రకటన విడుదల కావడం విశేషం.
గత్యంతరం లేని పరిస్థితిలోనే..
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వాలకు చిన్న చూపు. రేపటి తరాన్ని రూపొందించే విద్యావ్యవస్థల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం విచారకరం. అప్పులు, వడ్డీలు పెరిగిపోయి నిర్వాహకులు నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు. ఫీజులు విడుదలైతే కానీ పరీక్షలు జరగనివ్వం.
– శ్రీపాద నరేశ్, సుప్మా, కార్యదర్శి
ప్రైవేట్ కాలేజీలు : 62
విద్యార్థులు : 50 వేలు (దాదాపు)

పరీక్షలపై ప్రతిష్టంభన