వైపాలెం మండలం వై.కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, 23 మందికి గాయాలు సహాయక చర్యల్లో పాల్గొన్న మాజీ మంత్రి సురేష్, స్థానికులు గాయపడిన వారిని స్వయంగా వాహనాల్లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలింపు
యర్రగొండపాలెం: ఆధ్యాత్మికత కోసం ఆలయానికి వెళ్తున్న వారు ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారంతా రక్షించండి అంటూ పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. యర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లి వద్ద హైవే రోడ్డుపై ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కారు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన అప్పిరెడ్డి వెంకటరమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తున్న కారు, శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురయ్యాయి. అదే సమయంలో వై.కొత్తపల్లిలోని తన గెస్ట్ హౌస్‌లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోన్ చేసి 108 అంబులెన్స్, హైవే అంబులెన్స్ రప్పించారు. క్షతగాత్రులు విలపిస్తుండగా మాజీ మంత్రితోపాటు ఆయన వెంట ఉన్న కార్యకర్తలు, స్థానికులు కలిసి బాధితులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారిని స్వయంగా వాహనాల్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులతో మాట్లాడి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.


