పచ్చని పొలాల్లో ఇనుప ముప్పు! | - | Sakshi
Sakshi News home page

పచ్చని పొలాల్లో ఇనుప ముప్పు!

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

టంగుటూరు పరిసర గ్రామాల్లో ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌పై రైతుల్లో వ్యతిరేకత

టంగుటూరు:

రన్‌ ఓర్‌ మైనింగ్‌ అంశం టంగుటూరుతోపాటు చుట్టుపక్కల మండలాల్లో కాకరేపుతోంది. పర్యావరణం దెబ్బతింటుందని, తాగునీటి లభ్యత తగ్గిపోతుందని, భూగర్భ జలాలకు సైతం ముప్పు వాటిల్లుతుందని, పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ప్రధానంగా రైతులతోపాటు ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ పరిశ్రమను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దంటూ టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు, ఎర్రజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు గత సోమవారం మూకుమ్మడిగా ఒంగోలు వెళ్లి గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ రాజాబాబుకు అర్జీ సమర్పించారు.

రైతుల జీవనంపై దెబ్బ

టంగుటూరు మండలం మర్లపాడు, కొణిజేడు, ఎరజర్ల, కందులూరు పరిసర గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇక్కడి రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. పొగాకుతో పాటు నిమ్మ, జామ, మామిడి వంటి వాణిజ్య తోటలను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశంలో ఐరన్‌ ఓర్‌ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాని నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, దుమ్ముధూళి, దట్టమైన పొగ వల్ల సారవంతమైన భూములు నిర్జీవంగా మారిపోతాయని రైతులు వాపోతున్నారు.

భూగర్భ జలాలు విషమయం

ఇప్పటికే అట్టడుగుకు పడిపోయిన భూగర్భజల మట్టాలు మైనింగ్‌ పరిశ్రమ ఏర్పాటు తర్వాత మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత రసాయన జలాలు భూమిలోకి ఇంకితే, చుట్టుపక్కల గ్రామాల్లోని తాగునీటి బావులు, బోర్లు పూర్తిగా విషపూరితంగా మారుతాయి. ఇది కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా, తాగడానికి బొట్టు నీరు కూడా దొరకని భయానకమైన నీటి కొరతను సృష్టిస్తుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాయు కాలుష్యంతో ప్రాణహాని

పరిశ్రమ నుంచి వెలువడే బొగ్గు పొడి, ఇనుప రజను, ప్రాణాంతక విషవాయువులు గాలిలో కలవడం వల్ల ఈ ప్రాంతం కాలుష్య కాసారంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ఆందోళన వెలిబుచ్చుతున్నా పాలకులు కనీసం పట్టించుకోకపోవడం ప్రజలు రగిలిపోతున్నారు.

జింపెక్స్‌ పోరాటం గుర్తుందా?

పరిశ్రమల కాలుష్యంపై ఈ ప్రాంత ప్రజల పోరాటం ఈనాటిది కాదు. గతంలో 2011 డిసెంబర్‌ 17వ తేదీన అప్పటి ‘జింపెక్స్‌’ పరిశ్రమ ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మర్లపాడు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాలుష్య భూతాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. 15 ఏళ్ల క్రితమే తాము తిరస్కరించిన కాలుష్య కారక పరిశ్రమలను, ఇప్పుడు మళ్లీ కొత్త పేర్లతో తమపై రుద్దాలని చూస్తే సహించేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

సారవంతమైన భూములు బీడువారే ప్రమాదం ఉందని ఆందోళన

భూగర్భ జలాలు విషతుల్యమై, వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన

2011 రణరంగాన్ని గుర్తుచేస్తూ

‘పరిశ్రమ వద్దు.. ‘ప్రాణాలు ముద్దు’

అంటున్న స్థానికులు

ప్రజా వ్యతిరేకత, పర్యావరణ ముప్పును పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్‌

గత సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ రాజాబాబుకు వినతిపత్రం అందజేత

జిందాల్‌ పరిశ్రమకు

అనుమతులివ్వొద్దు

మర్లపాడు గ్రామంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ పరిశ్రమ మైనింగ్‌ చేయడానికి అనుమతులు ఇవ్వరాదు. తలపెట్టిన ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని కాదని ముందుకు వెళితే గతంలో కంటే తీవ్రమైన ప్రజా ఉద్యమం చేపడతాం. చట్టపరమైన పోరాటం చేస్తాం. ప్రజల ఆరోగ్యం దష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

– సింగమనేని బ్రహ్మయ్య, మర్లపాడు

భూగర్భ జలాలు

ఇంకిపోయే ప్రమాదం

జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తారు. ఫలితంగా ఎరజర్ల, మర్లపాడు, కందూలురు చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున పరిశ్రమ ఏర్పాటుపై పునరాలోచించాలి.

– బుర్ర అంకరాజు

ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పు

జిందాల్‌ ఇనుము శుద్ధి కర్మాగారం ఏర్పాటు వల్ల దాని నుంచి వచ్చే కాలుష్యకారకాల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వృద్ధులు చిన్నపిల్లలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. పరిశ్రమ ఏర్పాటుపై ఒంటెద్దు పోకడలు సరికాదు.

– ఈదర అమర్నాథ్‌ చౌదరి,

మర్లపాడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement