సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు మినీ స్టేడియం వద్ద నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జె.జయంతి బాబు కోరారు. ఆదివారం సంతనూతలపాడులోని సుందరయ్య భవన్లో నిర్వహించిన రైతు సంఘ మండల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతులను అప్పుల బారిన పడకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభమైన పొగాకు ధర.. నేడు రూ.160కి పడిపోయిందని ఆందోళన చెందారు. రోజురోజుకీ ధర దిగజారుతోందని అన్నారు. కానీ, ప్రభుత్వాలకు రైతుల పట్ల చిన్నచూపు ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చంనాయుడు పొగాకు పండే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాలు తీసుకుని రైతులకు మంచి ధర వస్తుందని, సంతృప్తిగా ఉందని మాట్లాడటమే అందుకు నిదర్శనమని అన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయని ప్రభుత్వాలు.. ఆ పంట ఎందుకు వేశావని రైతులపై ఎదురు దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను దివాలా తీయించి రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. రైతులను ఆ భూముల్లో కూలీలుగా మార్చే విధానాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా పొగాకు రైతులంతా మేల్కొని ఐక్యంగా గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ట్రాక్టర్ల ర్యాలీలో ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్‌తో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రైతు సంఘ మండల అధ్యక్షుడు హనుమంతరావు అధ్యక్షత వహించగా, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి నల్లూరి వెంకట నరసింహ, రైతు సంఘ నాయకులు కిలారి పెద్దబ్బాయి, ముండ్లమూరి నారాయణ, బత్తుల సుబ్బారావు, పోతినేని చిన్న అంజయ్య, ఆర్.సీతారామయ్య, ఎన్.శ్రీనివాసరెడ్డి, షేక్ కమాల్ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం 19న ఒంగోలులో ర్యాలీ


