మహిళను హత్య చేసిన నిందితుడికి సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

మహిళను హత్య చేసిన నిందితుడికి సంకెళ్లు

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

మహిళను హత్య చేసిన నిందితుడికి సంకెళ్లు

లింగసముద్రం: మండలంలోని పెంట్రాలలో జయంపు గోవిందమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రాపూరి పోలమ్మ మూడో కుమార్తె జయంపు గోవిందమ్మకు గతంలో కావలికి చెందిన రమణయ్యతో వివాహమైంది. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. అనంతరం ఆమె నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేటకు చెందిన పాలకీర్తి వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. వెంకటేశ్వర్లు నిత్యం గోవిందమ్మను అనుమానిస్తూ మానిసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులను తట్టుకోలేక గోవిందమ్మ సుమారు వారం రోజుల క్రితం పెంట్రాలలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నెల 10వ తేదీన ఉదయం వెంకటేశ్వర్లు ఆమెను తనతో రావాలని కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి వచ్చి మరోసారి ఇద్దరూ గొడవపడ్డాడు. 11వ తేదీ తెల్లవారు జామున పెంట్రాల గ్రామంలో ఇంటి వెనుక భాగంలో ఆమె నిద్రిస్తోంది. ఆ సమయంలో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేస్తుండగా కేకలు వేసింది. కేకలు వినిపించడంతో పోలమ్మ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. కత్తితో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు దాడి చేస్తున్నట్లు గమనించారు. వారిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లి పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు సీఐ నరేష్‌కుమార్‌ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గుడ్లూరు సీఐ తన సర్కిల్‌ పరిధిలోని లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం ఎస్సైలు జి.రాంబాబు, వి.వెంకటరావు, బి.ప్రేమ్‌కుమార్‌తో మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయిపేట శివారు ప్రాంతంలో అతడి ఆచూకీ కనుగొని వెంకటేశ్వర్లును శుక్రవారం అదుపులోకి తీసుకుని గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీ కోసం కందుకూరు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. కేసు నమోదు చేసి రెండు రోజుల్లో నిందితుడిని అత్యంత చాకచక్యంగా ఆరెస్టు చేసిన దర్యాప్తు అధికారి నరేష్‌కుమార్‌, ఎస్సైలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement