రాష్ట్ర ప్రజలకు బాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు బాబు వెన్నుపోటు

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు విజయం సాధించారు

గ్రామాల్లోకి వెళ్లి సూపర్‌ సిక్స్‌ అమలు చేశామనే దమ్ము లేదు

హామీల అమలుపై ప్రశ్నించే వారిమీద అక్రమ కేసులు పెడుతున్నారు

అక్రమ కేసులకు భయపడం

దర్శి: దేశంలో కుటుంబ సభ్యులకు..ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో విజయం సాధించిన ఒకే ఒక్క దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి జనం పోటెత్తారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్‌ వరకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకుని వైఎస్సార్‌ సీపీ జెండాలతో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు జగనన్న పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో పాటు అదనంగా 140 కొత్త హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయకుండా పేదలను మోసం చేసి దారుణంగా వెన్నుపోటు పొడిచారని శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవమా కాదా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు రూ.1500 ఇస్తామన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క మహిళకై నా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇది వారికి వెన్నుపోటు పొడవటమేనన్నారు. డిగ్రీ పాసైన అందరికీ రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని, వాటిలో ఒక్క నిరుద్యోగికై నా ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలోనే 10 వేల మందికి పైగా నిరుద్యోగులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగనన్న సుమారు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు, నివాసాలు కట్టించి ఇస్తే... మీరిచ్చిన ఒక సెంటు, అర సెంట్లు సమాధులకు కూడా చాలవని చెప్పి ఎగతాళి చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ అమలు చేశారన్నారు. మెరిట్‌ లిస్ట్‌ లేకుండా రూ.15 లక్షలు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి మెరిట్‌ విద్యార్థులను దారుణంగా వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే ఎవరూ భయపడేది లేదన్నారు. ప్రతి కార్యకర్త మన దేవుడు, మన దైవం జగనన్నను సీఎం చేసుకునేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారన్నారు. పీడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ అని చెప్పి దానిని దగా డీఎస్సీ గా మార్చారన్నారు. స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం రాలేదన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డీఎస్సీని అవినీతిమయం చేశారన్నారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడపీకారన్నారు.

దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement